ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ శాఖకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణల ప్రకారం.. అక్కడ కొంతమంది టీమ్ లీడర్లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళా ఉద్యోగులపై మానసికంగా, లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
మహిళలను టీమ్ లీడర్ల డెస్క్ దగ్గరకు పిలిచే సమయంలో అసభ్యకరమైన, అవమానకరమైన భాషను ఉపయోగించేవారని చెప్పారు. ఒక ప్రొఫెషనల్ కార్యాలయంలో ఊహించలేని విధంగా అసభ్య ప్రవర్తన కొనసాగిందని ఆమె వెల్లడించారు. ముఖ్యంగా తౌసిఫ్ అత్తర్ అనే వ్యక్తి హిందూ సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని, పండుగల సమయంలో చీరలు లేదా బొట్టులు ధరించిన మహిళలను అవమానించేవాడని ఆరోపించారు.
ఒక సహోద్యోగి కృష్ణ రుద్రాక్ష మాలను ధరించేవాడని, తరువాత మత మార్పిడి చేసుకున్నాడని కూడా ఆమె పేర్కొన్నారు. నిదా ఖాన్ అనే ఉద్యోగి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె హెచ్‌ఆర్ కాకపోయినా, ఇతర విభాగాలకు మారేందుకు ప్రయత్నించడం అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు.
ఆఫీసులో భద్రత పేరుతో ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లు, బ్యాగులు, లంచ్ బాక్సులు బయట ఉంచాల్సి వచ్చేదని, దీని వల్ల లోపల జరిగే కార్యకలాపాలు రికార్డు కాకుండా ఉండేవని తెలిపారు. డానిష్, రాజా వంటి ఉద్యోగులు వీకెండ్లలో హోటళ్లు బుక్ చేసి మహిళలను ఒత్తిడి చేసి తీసుకెళ్లేవారని కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనల వల్ల కార్యాలయ వాతావరణం పూర్తిగా విషపూరితంగా మారిందని, ఉద్యోగం వదిలిన తర్వాత మాత్రమే తాను సురక్షితంగా ఉన్నానని ఆ మహిళ తెలిపారు. ఇంత పెద్ద సంస్థలో ఉన్న ఉన్నతాధికారులకు ఈ వ్యవహారాలు తెలియకపోవడం ఆశ్చర్యకరమని ఆమె ప్రశ్నించారు.
ఈ కేసు ఒక్క వ్యక్తి ఆరోపణలతో మాత్రమే కాకుండా.. మొత్తం ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 2022 నుంచి మార్చి 2026 వరకు జరిగిన మానసిక, లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయబడింది.
ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు. వారిలో తౌసిఫ్ అత్తర్, డానిష్ షేఖ్, రాజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేఖ్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీ, నిదా ఖాన్ ఉన్నారు. ఇంకా ఒక మహిళా ఉద్యోగి అదృశ్యంగా ఉండటం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తోంది. కాగా అరెస్టు అయిన వారిని సంస్థ సస్పెండ్ చేసింది.


