గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ కంటే తక్కువ జనాభా కలిగిన తైవాన్, భారతదేశాన్ని అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా నిలిచింది. తైవాన్ మార్కెట్ విలువ సుమారు 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరగా, భారత్ మార్కెట్ విలువ 4.92 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ డేటా వెల్లడించింది.
తైవాన్ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్. ముఖ్యంగా తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) అనే చిప్ తయారీ సంస్థ భారీ వృద్ధిని సాధించింది. ఈ కంపెనీ షేర్లు ఈ ఏడాది 49% వరకు పెరగడం వల్ల తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది.
టీఎస్ఎంసీ ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థగా.. ఎన్విడియా, ఆపిల్, అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్, క్వాల్‌కామ్ ఉపయోగించే అధునాతన చిప్‌లను తయారు చేసి సరఫరా చేస్తోంది. దీంతో ప్రపంచ పెట్టుబడిదారులు ఏఐ, సెమీకండక్టర్ రంగాలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ.. తైవాన్ మార్కెట్‌లోకి పెద్ద మొత్తంలో నిధులు తరలిస్తున్నారు. ఫలితంగా తైవాన్ మార్కెట్ వేగంగా ఎదిగింది.
అయితే.. ప్రస్తుతం భారత్ పరిస్థితి భిన్నంగా మారింది. పెరుగుతున్న ఇంధన ధరలు, రూపాయి విలువ తగ్గడం, కార్పొరేట్ లాభాల మందగింపు వంటి కారణాలతో విదేశీ పెట్టుబడిదారులు.. భారీగా నిధులు ఉపసంహరించుకుంటున్నారు. అంతే కాకుండా గ్లోబల్ ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో భారత్‌కు ఇంకా పెద్ద స్థాయిలో లిస్టెడ్ కంపెనీలు లేకపోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశానికి పెద్ద ఆర్థిక వ్యవస్థ, 140 కోట్లకుపైగా జనాభా, వేల సంఖ్యలో లిస్టెడ్ కంపెనీలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం గ్లోబల్ క్యాపిటల్ ఎక్కువగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్కెట్లవైపు వెళ్తోంది. కానీ ఇప్పుడు తైవాన్.. భారత్‌ను అధిగమించడం అనేది ఇండియాకు పెద్ద నష్టం కాదు. ఈ సమయంలో కూడా దేశీయ పెట్టుబడిదారుల బలం, SIPలు, రిటైల్ ఇన్వెస్టర్ల మద్దతుతో భారత మార్కెట్ స్థిరంగా కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు.


