ఇంధన సరఫరానే లక్ష్యంగా చైనా విధించగల సంభావ్య నౌకాదళ దిగ్బంధనాన్ని (నావెల్ బ్లాకేడ్) ఎదుర్కోవడానికి తైవాన్ ప్రభుత్వం భారీ యుద్ధ విన్యాసాలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్న తరుణంలో తైవాన్ తన సొంత ఎనర్జీ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. చైనా ఒకవేళ తైవాన్ చుట్టూ ఇంధన దిగ్బంధనం విధిస్తే దానికి ధీటుగా సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ), చమురు నౌకలను సురక్షితంగా తీరానికి చేర్చేలా ఈ కసరత్తులు ఉండనున్నాయి.
ఎస్కార్ట్ మిషన్లు
ఈ ప్రత్యేక రక్షణ విన్యాసాల్లో తైవాన్ నావికాదళం కీలక పాత్ర పోషించనుంది. సముద్ర మార్గంలో చైనా నౌకలు అడ్డుకోకుండా ఇంధనంతో వచ్చే భారీ నౌకలకు తైవాన్ యుద్ధనౌకలు రక్షణ కవచంలా (ఎస్కార్ట్) నిలుస్తాయి. శత్రువుల దిగ్బంధనాన్ని ఎలా ఛేదించాలో ఈ డ్రిల్స్‌లో భాగంగా సైన్యం అనుకరిస్తుంది. ప్రధాన ఓడరేవులపై చైనా పట్టు సాధిస్తే ఇతర చిన్న రేవుల ద్వారా సరఫరాను ఎలా కొనసాగించాలనేది కూడా ఈ ప్రణాళికలో భాగం.
ప్రాంతీయ ముప్పుగా 'బ్లాకేడ్'
తైవాన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ ఈ కసరత్తులపై స్పందిస్తూ చైనా చర్యలు కేవలం తైవాన్‌కు మాత్రమే పరిమితం కావని హెచ్చరించారు. ‘చైనా విధించే ఇంధన దిగ్బంధనం తైవాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా మొత్తం ఇండో-పసిఫిక్ ప్రాంతం ఇంధన సరఫరా గొలుసును ఛిన్నాభిన్నం చేస్తుంది. ఇది ప్రపంచ ఇంధన భద్రతకే సవాలు’ అని ఆయన పేర్కొన్నారు.
ఇంధన సంక్షోభం వైపు తైవాన్?
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు తైవాన్‌కు కీలకంగా మారాయి. తైవాన్ తన విద్యుత్ అవసరాల కోసం 50% పైగా ఎల్‌ఎన్‌జీ పైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం తైవాన్ వద్ద ఉన్న గ్యాస్ నిల్వలు కేవలం కొన్ని రోజులకు మాత్రమే సరిపోతాయి. యుద్ధం వస్తే ఈ నిల్వలు త్వరగా నిండుకునే ప్రమాదం ఉంది. దిగ్బంధనం సమయంలో గ్యాస్ కొరతను అధిగమించడానికి తైవాన్ తన బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను సిద్ధం చేస్తోంది.
తైవాన్ సమీపంలో చైనా తన సైనిక కదలికలను పెంచుతున్న నేపథ్యంలో తైపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ఎనర్జీ డ్రిల్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం ఆయుధాలే కాదు, ఇంధన లభ్యత కూడా కీలకమని తైవాన్ గుర్తించింది.
ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!


