
భారతదేశంపై ప్రతీకార సుంకాలను విధించడంతో.. అమెరికా శాంతించడం లేదు. రోజుకో ప్రతిపాదన చేస్తూ ప్రపంచ దేశాలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పుడు తాజాగా నాన్-ఇమిగ్రెంట్ వీసా(ఎన్ఐవీ)ల కోసం దరఖాస్తు చేసుకునేవారు.. ఇకపై మరో దేశంలో ఇంటర్వ్యూకు హజరయ్యే అవకాశం లేదని తేల్చి చెప్పేసింది.
ఇప్పటి వరకు షార్ట్ టర్మ్ వీసాదారులు గడువు తీరిన తర్వాత అమెరికాలోనే.. మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వీలుండేది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా (ఎన్ఐవీ) దరఖాస్తుదారుల నిబంధనలను కఠినతరం చేసింది. వీసాల ఇంటర్వ్యూ కోసం.. తమ సొంత దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌లో ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేసుకోవాలని కోరింది.
ఈ కొత్త సూచనలు వెంటనే అమలులోకి వస్తాయి. విద్యార్థులు, వ్యాపార కార్యకలాపాలకు సంబంధించినవారు, తాత్కాలిక కార్మికులు, పర్యాటకులతో సహా అన్ని వర్గాల వలసేతర వీసాదారులకు ఈ కొత్త రూల్.. ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుందని స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.
ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!
అమెరికా కొత్త నిబంధనలు భారతీయులకు సమస్యగా మారుతుంది. కొత్త నియమాల కారణంగా ఎన్ఐవీ వీసా ఇంటర్వ్యూ కోసం మళ్లీ స్వదేశాల బాట పట్టాల్సి ఉంది. మహమ్మారి సమయంలో.. చాలామంది తమ వీసా ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి బ్యాంకాక్, సింగపూర్ వంటి సమీప కేంద్రాలకు మాత్రమే కాకుండా.. ఫ్రాంక్‌ఫర్ట్, రియో డి జనీరో, చియాంగ్ మాయి వంటి సుదూర గమ్యస్థానాలకు కూడా ప్రయాణించారు. ఇకపై ఆ అవకాశం లేదు.