
ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ రెడీ
రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లలో సందడి
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌పై విశ్లేషకుల అంచనాలు
ప్రధానంగా తొలి త్రైమాసిక ఫలితాలే ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత వారాతాన పలు దిగ్గజాలు ఏప్రిల్–జూన్(క్యూ1) పనితీరు వెల్లడించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో మరిన్ని బ్లూచిప్స్ క్యూ1 ఫలితాలు వెల్లడించనున్నాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్
గత వారాంతాన ప్రకటించిన క్యూ1 ఫలితాలలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డ్‌కు తెరతీసింది. ఒక త్రైమాసికంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 26,994 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ బాటలో ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. వాటాదారులకు సంస్థ చరిత్రలోనే తొలిసారి అదికూడా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీని ప్రకటించింది. ఇక మరో దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ సైతం పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ1లో 16% వృద్ధితో రూ. 13,558 కోట్ల నికర లాభం ఆర్జించింది. వెరసి నేడు ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లు సందడి యనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు.
బ్లూచిప్స్ రెడీ..: ప్రస్తుత ఆర్థి క సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక ఫలితాల సీజన్ మరింత జోరందుకోనుంది. ఈ వారం డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, ఎంఅండ్‌ఎం, ఏసీసీ, కాల్గేట్, డిక్సన్, తదితర బ్లూచిప్స్ క్యూ1 పనితీరు వెల్లడించనున్నాయి. అంతేకాకుండా ఎటర్నల్, జీల్, ఎంఫసిస్, కెనరా బ్యాంక్, ఎస్ బీఐ లైఫ్ తదితరాలు సైతం ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఫలితాలపై అత్యధికంగా దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు.
వాణిజ్య డీల్స్..: యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే బాటలో దేశీ ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. ఈ వారం వాణిజ్య ఒప్పందం కుదిరితే సెంటిమెంటు సానుకూలంగా ప్రభావితమవుతుందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఇది విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపే వీలున్నట్లు తెలియజేశారు. వడ్డీ రేట్లపై యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై గత వారం భారత్, యూఎస్ బృందాలు నాలుగు రోజులపాటు వాషింగ్టన్‌లో నిర్వహించిన ఐదో రౌండ్ చర్చలు పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో ఆగస్ట్ 1కల్లా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఫలితంగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావానికి చెక్ పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఇన్వెస్టర్లలో అనిశ్చితికి కారణమవుతున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా వివరించారు.
సాంకేతికంగా చూస్తే..
గత వారం నిఫ్టీ 25,000 మైలురాయి దిగువన 24,900కు క్షీణించింది. దీంతో సాంకేతిక నిపుణుల అంచనా ప్రకారం ఈ వారం ఆటుపోట్ల మధ్య మరింత బలహీనపడి 24,500వరకూ నీరసించే వీలుంది. అయితే మార్కెట్లు బలపడితే నిఫ్టీకి 25,250 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు.
ఎఫ్‌పీఐల వెనకడుగు
జులైలో రూ. 5,524 కోట్లు వెనక్కి
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 5,524 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. దీంతో 2025 తొలి 7 నెలల్లో రూ. 83,245 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. అయితే జూన్‌లో రూ. 14,590 కోట్లు, మే నెలలో రూ. 19,860 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్ మధ్య నుంచి అమ్మకాల బాటను వీడి రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతకుముందు మార్చిలో రూ. 3,973 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, జనవరిలో రూ. 78,027 కోట్లు చొప్పున పెట్టుబడులు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
గత వారమిలా
వరుసగా మూడో వారం దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 743 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 81,758 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్ నిఫ్టీ 181 పాయింట్లు తగ్గి 24,968 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు 1–1.5 శాతం చొప్పున నష్టపోయాయి.