
రెండో రోజూ సూచీలు డీలా
రూ.9.69 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: అమెరికా విధించిన 50% సుంకాలు అమల్లోకి రావడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ దాదాపు ఒకశాతం నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలోప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండడం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. సెన్సెక్స్ 706 పాయింట్లు నష్టపోయి 80,080 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 211 పాయింట్లు కోల్పోయి 24,501 వద్ద ముగిశాయి. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. బలహీనంగా మొదలైన సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. వినిమయ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
ఒక దశలో సెన్సెక్స్ 774 పాయింట్లు క్షీణించి 80,013 వద్ద, నిఫ్టీ 230 పాయింట్లు కోల్పోయి 24,482 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు బలహీనపడి 87.58 వద్ద స్థిరపడింది. టారిఫ్ సంబంధిత అనిశ్చితులతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.
⇒ సూచీల పతనంతో రెండు రోజుల్లో రూ.9.69 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.445.17 లక్షల కోట్లకు దిగివచి్చంది. గురువారం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది.
⇒ ట్రాన్స్‌ఫార్మర్ ఉపకరణాల తయారీ సంస్థ మంగళ్ ఎల్రక్టానిక్స్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర (రూ.561)తో పోలిస్తే బీఎస్‌ఈలో అరశాతం డిస్కౌంట్ రూ.558 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 6% క్షీణించింది, చివరికి 4.50% నష్టంతో రూ. 534 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,475.31 కోట్లుగా నమోదైంది.