
సెన్సెక్స్ లాభం 595 పాయింట్లు
యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంపై ఆశలు
ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల ప్రభావం
ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు డిమాండ్
ముంబై: అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలం కావొచ్చనే ఆశలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో స్టాక్ సూచీలు మంగళవారం అరశాతానికి పైగా లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి బలోపేతం, అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 595 పాయింట్లు పెరిగి 82,381 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 170 పాయింట్లు బలపడి 25,239 వద్ద నిలిచింది. ముగింపు స్థాయి సూచీలకి రెండు నెలల గరిష్టం. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.
ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా జీఎస్‌టీ సంస్కరణలు, పండుగ డిమాండ్ రికవరీపై ఆశలతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలమవ్వొచ్చనే ఆశలతో ఐటీ షేర్లు రాణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 658 పాయింట్లు బలపడి 82,443 వద్ద, నిఫ్టీ 192 పాయింట్లు ఎగసి 25,261 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ఆసియాలో సింగపూర్, హాంగ్‌కాంగ్ మినహా అన్ని దేశాల మార్కెట్లు 1% పెరిగాయి. యూరప్ మార్కెట్లు అరశాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.
⇒ అధిక వెయిటేజీ ఎల్‌అండ్‌టీ(2%), కోటక్ మహీంద్రా(2.50%), మహీంద్రా (2.2%), మారుతీ (2%), టీసీఎస్ (1%) రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం పాయింట్లలో ఈ షేర్ల వాటాయే 352 పాయింట్లు కావడ విశేషం.