ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయుడు | Sakshi
Sakshi News home page

ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయుడు

Published Thu, Mar 7 2024 8:46 AM

Srinivasan KSwamy Presented With IAA Golden Compass Award - Sakshi

ఆర్‌కె స్వామి హన్సా గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ శ్రీనివాసన్‌ కె.స్వామి(సుందర్‌ స్వామి) ప్రపంచ ప్రతిష్టాత్మక ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డును అందుకున్నారు. మలేషియాలోని పెనాంగ్‌లో జరిగిన 45వ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్‌లో పెనాంగ్ గవర్నర్ తున్ అహ్మద్ ఫుజి అబ్దుల్ రజాక్ చేతులమీదుగా ఈ అవార్డు తీసుకున్నారు. 

మార్కెటింగ్, ప్రకటనలు, మీడియా పరిశ్రమలో ప్రపంచ స్థాయిలో గణనీయమైన కృషి చేసిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. అయితే ఒక భారతీయుడుకి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఈ అవార్డును అందుకున్న వారిలో షెల్లీ లాజరస్ (ఛైర్మన్ ఎమెరిటస్, ఓగిల్వీ అండ్‌ మాథర్), పాల్ పోల్‌మన్ (సీఈఓ, యూనిలీవర్), పాల్ రోస్సీ (ప్రెసిడెంట్, ఎకనామిస్ట్ గ్రూప్), మార్క్ ప్రిచర్డ్ (చీఫ్ బ్రాండ్ ఆఫీసర్, ప్రాక్టర్ & గాంబుల్), ఆండ్రూ రాబర్ట్‌సన్ (ప్రెసిడెంట్ & సీఈఓ, బీబీడీఓ) ఉన్నారు.

అవార్డు అందుకున్న సందర్భంగా శ్రీనివాసన్‌ స్వామి మాట్లాడుతూ..తనకు ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందుకు సహకరించిన తన సహచరులు, నిపుణులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చాలా ఏళ్లపాటు ఆయన తండ్రి దివంగత ఆర్‌కె.స్వామి అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ అవార్డును తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.

  • శ్రీనివాసన్ కె.స్వామి ఆర్‌కె స్వామి లిమిటెడ్ కంపెనీ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
  • ఆయన 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌(ఏబీసీ) ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • ప్రస్తుతం ఆయన ఏషియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అడ్వర్‌టైజింగ్‌ అసోసియేషన్స్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
  • గతంలో ఆయన ఇంటర్నేషనల్‌ అడ్వర్‌టైజింగ్‌ అసోసియేషన్స్‌ (ఐఏఏ), ఐఏఏ ఇండియా చాప్టర్‌, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏషియన్‌ అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీ అసోసియేషన్స్‌, అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, అడ్వర్‌టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌, మద్రాస్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, మద్రాస్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్స్‌కు అధ్యక్షుడు/ఛైర్మన్‌గా పనిచేశారు.
  • శ్రీనివాసన్‌ కె.స్వామి అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి జీవనకాల సాఫల్య అవార్డును అందుకున్నారు. 

ఇటీవలే ఐపీఓలోకి..

ఇంటిగ్రేటెడ్‌ మార్కెటింగ్‌ సర్వీసెస్‌ సంస్థ ఆర్‌కే స్వామి లిమిటెడ్‌ ఇటీవలే ఐపీఓగా మార్కెట్‌లోకి రావాలని నిర్ణయించింది. దాంతో నిన్నటితో షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ ముగిసింది. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.270-288గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.423.56 కోట్లు సమీకరించనుంది. రూ.173 కోట్లు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేస్తున్నారు. రూ.250.56 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉంచారు. రిటైల్‌ మదుపర్లు కనీసం రూ.14,400తో 50 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్చి 12న మార్కెట్‌ లిస్ట్‌ అవ్వనుంది. 

ఇదీ చదవండి: ఫార్చూన్‌ 500 లీడర్లలో మహిళలు అంతంతే ..

ప్రముఖ కంపెనీలకు ఆర్‌కే స్వామి లిమిటెడ్‌ క్రియేటివ్‌ మీడియా, డేటా అనలిటిక్స్‌, మార్కెట్‌ రీసెర్చ్‌ వంటి సేవలను అందిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో తమ క్లయింట్లకు దాదాపు 818 ప్రచార కార్యక్రమాలను రూపొందించింది. 2.37 మిలియన్ల ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, మోతీలాల్ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ ఈ ఐపీఓకి లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించాయి.

Advertisement
 
Advertisement