రివైండ్‌ 2020: ఢామ్‌.. జూమ్‌

Special Story on stock Markes in India Rewind-2020 - Sakshi

ఆందోళన నుంచి ఆశావాదం వైపు

2020... వస్తూవస్తూనే ‘కరోనా’ సునామీతో ప్రపంచానికి ‘మాస్క్‌‘ పడింది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజల జీవితాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా చెల్లాచెదురైంది. వివిధ దేశాల ఎకానమీలు మైనస్‌లలోకి జారిపోయి చరిత్రలో ఎన్నడూచూడని పతనాన్ని చవిచూశాయి. భారత్‌ జీడీపీ ఏకంగా 23.9 శాతం (క్యూ1లో) క్షీణించింది. కరోనా కల్లోలంతో స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయినప్పటికీ.. మళ్లీ అంతేవేగంగా కోలుకొని, ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి.

సెన్సెక్స్‌ మార్చిలో 25,638 పాయింట్ల కనిష్టానికి కుప్పకూలి... కొద్ది నెలల్లోనే కొత్త రికార్డులను బద్దలు కొట్టింది. మరోపక్క, ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో బంగారం భగ్గుమంది. భారత్‌లో తులం ధర రూ.55 వేల పైకి ఎగబాకింది. ముడి చమురు ధర చరిత్రలో తొలిసారిగా మైనస్‌లోకి జారిపోయింది. ఇక కరోనాతో దేశీయంగా పర్యాటకం, విమానయానం తదితర రంగాలు తీవ్రంగా దెబ్బతిని, భారీగా ఉద్యోగాల కోతకు దారితీసింది. అసలే మొండిబాకీలతో నెట్టుకొస్తున్న  బ్యాంకింగ్‌ రంగం పరిస్థితి పెనంమీంచి పొయ్యిలో పడినట్లయింది. పీఎంసీ, లక్ష్మీ విలాస్‌ బ్యాంకులు కుప్పకూలాయి. లాక్‌డౌన్‌ల కారణంగా వాహన రంగంలో ఎన్నడూలేని విధంగా సున్నా అమ్మకాలు నమోదయ్యాయి.

మోదీ సర్కారు ‘ఆత్మనిర్భర్‌’ రూపంలో దాదాపు రూ. 29 లక్షల కోట్లకు పైగా ప్యాకేజీని ప్రకటించి ఎకానమీకి దన్నుగా నిలిచింది. ఆర్‌బీఐ కూడా వడ్డీరేట్లను అట్టడుగుకు దించేసింది. ఇంత కల్లోలంలోనూ ముకేశ్‌ అంబానీ నిధుల స్వారీ చేశారు. ఫేస్‌బుక్, గూగుల్, ఇంటెల్‌ ఇలా ఒకటేమిటి ప్రపంచాన్ని శాసిస్తున్న అనేక దిగ్గజ కంపెనీలన్నీ రిలయన్స్‌ జియో, రిటైల్‌లలో కోట్లాది డాలర్లు కుమ్మరించేందుకు క్యూ కట్టడం విశేషం. కరోనా పుణ్యమా అని సామాన్యుల నుంచి కార్పొరేట్ల దాకా అంతా డిజిటల్‌ బాట పట్టారు. వర్చువల్, ఆన్‌లైన్‌ అనేవి జీవితంలో భాగమైపోయాయి. ఇలా ఒక రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా సాగిన ఈ ‘కరోనా’నామ సంవత్సరంలో వ్యాపార రంగంలో చోటు చేసుకున్న పరిణామాలపై ‘సాక్షి బిజినెస్‌’ రివైండ్‌ ఇది...

మార్కెట్‌ ఉద్దీపనల అండ!
ఈ ఏడాది భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రయాణం కరోనా విసిరిన సవాళ్లను అధిగమించి కొత్త శిఖరాల అధిరోహణ లక్ష్యంగా సాగింది.  ఏడాది ప్రారంభంలో ఆర్థిక మందగమనం, కోవిడ్‌ భయాలతో సెన్సెక్స్, నిఫ్టీలు మార్చి 24న రెండేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. ద్వితీయార్థంలో ఉద్దీపనల అండ, ఆర్థిక వ్యవస్థ రికవరీ, కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ఆశలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సహకారం అందడంతో రికార్డుల ర్యాలీ చేస్తున్నాయి. మరోవైపు కోవిడ్‌–19 వైరస్‌.... స్ట్రెయిన్‌ వైరస్‌గా రూపాంతరం చెంది ప్రపంచదేశాలను భయపెడుతుండటం ఈక్విటీ మార్కెట్లకు ఆందోళనను కలిగిస్తోంది. ఈ ఏడాది మొత్తం మీద సెన్సెక్స్‌ 6492 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 1814 పాయింట్లను ఆర్జించింది.  లాక్‌డౌన్‌ విధింపు ప్రకటనతో మార్చి 23న సెన్సెక్స్, నిఫ్టీలు తమ జీవితకాలంలోనే అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇరు సూచీలు 10 శాతం పతనమవడంతో సర్క్యూట్‌ నిబంధల ప్రకారం ట్రేడింగ్‌ను 45 నిమిషాలు నిలిపేశారు. తర్వాత ట్రేడింగ్‌ ప్రారంభమైనా అమ్మకాలు ఆగకపోవడంతో సెన్సెక్స్‌ 3,935 పాయింట్లు, నిఫ్టీ 1,135 పాయింట్ల నష్టంతో ముగిశాయి. ఇక ఏప్రిల్‌ 7న సూచీలు ఒక్కరోజులో రికార్డు లాభాల్ని ఆర్జించాయి. ఈ ఒక్కరోజే సెన్సెక్స్‌ 2,476 పాయింట్లు, నిఫ్టీ 1,135 పాయింట్లను    ఆర్జించాయి.
సూచీ    ఏడాది కనిష్టస్థాయి    ఏడాది గరిష్టస్థాయి
సెన్సెక్స్‌    25,638 (మార్చి 24న)    47,807(డిసెంబర్‌ 30)
నిఫ్టీ    7511 (మార్చి 24న)    13,997(డిసెంబర్‌ 30)

ఎకానమీ మాంద్యం కోరలు...
భారత ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ గట్టి దెబ్బ కొట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం కోరల్లోకి వెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏకంగా మైనస్‌ 23.9 శాతానికి పడిపోయింది. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలింపుసహా ఎకానమీ కోలుకునేందుకు కేంద్రం, ఆర్‌బీఐలు తీసుకున్న ఉద్దీపన చర్యలతో రెండో త్రైమాసికానికి వ్యవస్థ కాస్త రికవరీని సాధించింది. క్షీణత మైనస్‌ 7.5 శాతానికి పరిమితమైంది.

కేంద్రం అండ ఆత్మ నిర్భర్‌ అభియాన్‌
కరోనా కుదేలైన ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలకు భరోసానిస్తూ కేంద్రం ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకం ద్వారా అభయమిచ్చింది. కోవిడ్‌ సంక్షోభం నాటి నుంచి ఈ ఏడాదిలో కేంద్రం, ఆర్‌బీఐలు సంయుక్తంగా మొత్తం రూ.29.87 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాయి.  జీడీపీలో 10 శాతం ఉంటుందని అంచనా. ల్యాండ్, లేబర్‌æ, లిక్విడిటీ, లా వీటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సూక్ష్మ, స్థూల, మధ్య తరగతి పరిశ్రమకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయడంలాంటి ఎన్నో బృహత్కర కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి.

బ్యాంకింగ్‌ కుదుపులు
యస్‌ బ్యాంక్, లక్ష్మీవిలాస్‌ బ్యాంకు, పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంక్‌(పీఎంసీ) ఉదంతాలతో ఈ ఏడాది భారత బ్యాంకింగ్‌ రంగం భారీగా కుదుపులకు లోనైంది. లక్ష్మీవిలాస్‌ బ్యాంకు ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ బ్యాంకులో విలీనమైంది. హెచ్‌డీఐఎల్‌కు రుణాలను జారీ చేయడంలో అక్రమాలకు తెరతీయడంతో మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంక్‌ ఆర్‌బీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. అలాగే నిరర్థక ఆస్తులు పెరిగిపోయి నష్టాల ఊబిలో కూరుకుపోయిన యస్‌ బ్యాంక్‌ను రక్షించేందుకు ఆర్‌బీఐ ఆ బ్యాంక్‌లోని 49 శాతం షేర్లను ‘ఎస్‌బీఐ’ చేత కొనుగోలు చేయించింది. ఇక  బ్యాంకింగ్‌లో మొండి బకాయిల తీవ్రత కొనసాగుతోంది.

ఆర్‌బీఐ పాలసీ భరోసా
కరోనాతో కష్టాలపాలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఈ ఏడాదిలో ఆర్‌బీఐ ద్రవ్యపాలసీ కమిటీ వడ్డీరేట్లను గణనీయంగా తగ్గించింది. రెపోరేటును 115 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 5.15 శాతం నుంచి 4 శాతానికి పరిమితం చేసింది. అలాగే రివర్స్‌ రెపోరేటు 155 పాయింట్లను తగ్గించి 4.9 శాతం నుంచి 3.35 శాతానికి తీసుకొచ్చింది. ప్రతి ద్రవ్యపాలసీ సమీక్షలో సులభతరమైన విధానానికి కట్టుబడి ఉంటామని, ద్రవ్యోల్బణం దిగివస్తే, వడ్డీరేట్లపై మరింత కోత విధించేందుకు వెనకాడబోమని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్యలు ఆర్థిక వ్యవస్థ రికవరీకి దన్నుగా నిలుస్తున్నాయి.

విమానయానం కుదేలు
కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో దేశీయ విమానయాన రంగం పూర్తిగా డీలాపడింది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు కేంద్రం మార్చి  23 నుంచి అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. మార్చి 25 నుంచి దేశీయ విమానాలపై ఆంక్షలను విధించింది. సర్వీసులన్నీ ఒక్కసారి స్తంభించిపోవడంతో విమానయాన కంపెనీలకు పైసా ఆదాయం లేకుండా పోయింది.  పైపెచ్చు ఆకస్మిక నిర్ణయంతో విమానయాన సంస్థలు ప్రయాణికులు బుక్‌ చేసుకున్న ముందస్తు టికెట్ల సొమ్మును తిరిగి చెల్లించాల్సి వచ్చింది. దీంతో దేశీయ విమాన కంపెనీలు దివాలా దిశగా ప్రయాణించాయి.

అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా దేశీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు మే 25న అనుమతులు లభించాయి. అలాగే జూలై నుంచి ఆయా దేశాలతో పరస్పర ఒప్పందంతో కొన్ని దేశాలకు విమానాలు నడుస్తున్నాయి. అయితే విమానయాన కంపెనీలకు అధిక ఆదాయాలను ఇచ్చే అంతర్జాతీయ సర్వీసులపైన ఆంక్షల పర్వం కొనసాగుతోంది. కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ రాకతో అన్ని సర్వీసులు పునరుద్ధరణ జరిగి విమానయాన రంగం తిరిగి గాడిలో పడుతుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆటోమొబైల్‌ కరోనా బ్రేకులు
ఈ 2020 ఏడాదిలో ఆటో మొబైల్‌ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. చరిత్రలోనే తొలిసారి ఒక నెల ఆటో అమ్మకాలు సున్నాగా నమోదయ్యాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఉత్పత్తి పూర్తిగా స్తంభించడం, విక్రయాలకు బ్రేక్‌పడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఉద్దీపన ప్యాకేజీలో ఆటో పరిశ్రమకు పెద్దపీట వేయడం, భారత్‌లో ఉత్పాదక సామర్థ్యాలను, ఎగుమతులను పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకంలో ఎక్కువగా దెబ్బతిన్న ఆటోమొబైల్‌ పరిశ్రమకు గరిష్టంగా రూ.57,042 కోట్ల ప్రోత్సాహకాలు లభించనుండటంతో చివరి రెండు క్వార్టర్ల నుంచి ఆటోపరిశ్రమ వీ–ఆకారపు రికవరీని సాధిస్తోంది.  రికవరీ స్పీడ్‌పై ఈ రంగం ఆధారపడి ఉంది.

ఫోన్లు స్మార్ట్‌...స్మార్ట్‌
స్మార్ట్‌ఫోన్ల కంపెనీలకు ఈ 2020 ఏడాది కలిసొచ్చింది. ఏడాది ప్రథమార్ధంలో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఆశించినస్థాయిలో నమోదుకాలేదు. అయితే చివరి రెండు క్వార్టర్ల నుంచి విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 15 కోట్లను దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  సరిహద్దు వివాదాలు, కరోనా వైరస్‌ సృష్టికి కారణమైందనే వాదనల నేపథ్యంలో చైనా ఫోన్లపై బ్యాన్‌ నినాదంతో దేశంలో మొదటిసారి చైనా ఫోన్ల అమ్మకాలు రెండోస్థానానికి దిగివచ్చాయి. దీంతో దక్షిణ కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ కంపెనీ అమ్మకాల్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది.

రిలయన్స్‌ అప్పు లేదు 
కరోనాతో ఎకానమీ కకావికలమైన తరుణంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మాత్రం ఈ ఏడాదిలో వరుస పెట్టుబడులతో కలకలలాడింది. గూగుల్, ఫేస్‌బుక్, సిల్వర్‌లేక్‌ వంటి దిగ్గజ కంపెనీలకు జియో ప్లాట్‌ఫామ్‌లో 33 శాతం వాటాను విక్రయించి రూ.1.52 లక్షల కోట్లను చేకూర్చుకుంది. అలాగే రైట్స్‌ ఇష్యూ చేపట్టి అదనంగా రూ.53 వేల కోట్లను సమీకరించింది. తన మరో అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌నూ 10 శాతం వాటాను విక్రయించి రూ.47 వేల కోట్లను సమకూర్చుకుంది. వాటా విక్రయాలు, ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులతో ఆర్‌ఐఎల్‌ రుణ రహిత కంపెనీగా అవతరించింది. కంపెనీలోకి వెల్లువలా పెట్టుబడులు రావడంతో కంపెనీ షేరు సైతం ఈ 2020లో 35 శాతం ర్యాలీ చేసింది. ఈ ఏడాదిలో సెప్టెంబర్‌ 16న రూ.2,369 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది.

రూపాయి ఒడిదుడుకులు
భారత ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో వెల్లువెత్తినా ఈ ఏడాది డాలర్‌ మారకంలో రూపాయి బలపడలేకపోయింది. స్టాక్‌ మార్కెట్‌ పతనం వేళలో ఆర్‌బీఐ స్పాట్‌ మార్కెట్‌ నుంచి అధిక మొత్తంలో డాలర్లను కొనుగోలు చేయడంతో రూపాయి విలువ బలహీనపడిందని అంచనా. అలాగే కరోనాతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ ఏడాది డాలర్‌ మారకంలో రూపాయి విలువ గరిష్ట స్థాయి 70.73 గానూ, కనిష్ట స్థాయి 76.92 గానూ నమోదైంది. వెరసి ఈ ఏడాదిలో రూపాయి విలువ 6 రూపాయల రేంజ్‌లో కదలాడింది.

క్రూడాయిల్‌ మైనస్‌లోకి
ఈ ఏడాది క్రూడాయిల్‌ ధరలు ఏకంగా మైనస్‌ల్లోకి వెళ్లిన సంఘటన జరిగింది. ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతో  క్రూడాయిల్‌కు డిమాండ్‌ అంతంతగానే ఉంది. మరోవైపు చమురు ధరలపై ఆధిపత్యం కోసం సౌదీ– రష్యా దేశాలు ఒప్పంద పరిమితికి మించి క్రూడాయిల్‌ ఉత్పత్తి చేయడంతో నిల్వలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ విధింపు క్రూడాయిల్‌ ధరలపై విరుచుకుపడింది. ఫలితంగా ఏప్రిల్‌ 21న నైమెక్స్‌ లైట్‌ స్వీట్‌ క్రూడ్‌ మే నెల ఫ్యూచర్‌ కాంట్రాక్ట్‌ బ్యారెల్‌ ధర తొలిసారి మైనస్‌లోకి వెళ్లిపోయింది. ఒక దశలో మైనస్‌ 40.32 డాలర్లకు చేరుకుంది. చివరికి 208 డాలర్లు నష్టపోయి మైనస్‌ 37.63 డాలర్ల వద్ద ముగిసింది.

బంగారం @ రూ. 56,190
కరోనా వైరస్‌తో స్టాక్‌ మార్కెట్లు కుదేలవడం ఈ ఏడాది పసిడి ర్యాలీకి కలిసొచ్చింది. కోవిడ్‌–19 సంక్షోభ వేళ ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనమైన బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. అలాగే ఆర్థికంగా చిన్నాభిన్నమైన వ్యవస్థను సరిదిద్దేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు సులభతర వడ్డీరేట్ల విధానానికి తెరతీయడం కూడా బంగారం ర్యాలీకి కలిసొచ్చింది. ప్రపంచమార్కెట్లో ఆగస్ట్‌ 7న  ఔన్స్‌ పసిడి ధర అత్యధికంగా 2,089 డాలర్ల స్థాయిని అందుకుంది. ఇదే ఆగస్ట్‌ 8న  దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,190 చేరుకుంది. మొత్తంగా పసిడి ధరలు  ఏడాదిలో 20 శాతం పెరిగాయి. అయితే కోవిడ్‌ వ్యాక్సిన్‌ రాక, ఆర్థిక వ్యవస్థ పురోగతి నేపథ్యంలో బంగారం ధరలు ఏడాది ముగింపు సమయానికి కొంత దిగివచ్చాయి. వచ్చే ఏడాదిలో పసిడి నుంచి పెద్ద ర్యాలీ ఆశించకపోవడం మంచిదని బులియన్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top