ఇప్పటికే చాలామంది సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు ముంబైలో ఆస్తులు, ఇల్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ టీమిండియా క్రికెటర్ 'శుభ్‌మన్ గిల్' కూడా చేరారు.
శుభ్‌మన్ గిల్.. ముంబై నగరంలోని జుహూ ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. ఈ అపార్ట్‌మెంట్ విలువ సుమారు రూ.20.7 కోట్లు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం.. ఈ ఫ్లాట్‌ను పూజా లీజర్ అండ్ లైఫ్‌స్టైల్ అనే సంస్థ నుంచి కొనుగోలు చేశారు.
శుభ్‌మన్ గిల్ కొనుగోలు చేసిన ఈ అపార్ట్‌మెంట్.. ముంబైలోని జుహూ తారా రోడ్డుపై ఉన్న పూజా ల్యూమినేర్ అనే భవనంలో 12వ అంతస్తులో ఉంది. గిల్ ఈ 12వ అంతస్తు మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 3,369 చదరపు అడుగులు. ఈ లావాదేవీ కోసం రూ.1.24 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలు మార్చి 26, 2026న జరిగింది. మహారాష్ట్ర RERA వివరాల ప్రకారం.. ఈ భవనం ఇంకా నిర్మాణంలో ఉంది. 2029 ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉంది.
ముంబైలో ఇతర క్రికెటర్ల అపార్ట్‌మెంట్స్
ఇటీవల కాలంలో భారత క్రికెటర్లు ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం గమనించదగ్గ విషయం. ఇందులో సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్ మొదలైనవారు ఉన్నారు.
👉సూర్యకుమార్ యాదవ్, అతని భార్య దేవిషా యాదవ్ ముంబైలోని డియోనార్ ప్రాంతంలో రూ.7.18 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.
👉రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ ప్రాభాదేవి ప్రాంతంలో రూ.26.30 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నారు.
👉జహీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సుమారు రూ.11 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.


