49000 పైకి సెన్సెక్స్‌

Sensex crosses 49,000-mark for first time ever Nifty above 14,400 - Sakshi

14500కు చేరువ లో ముగిసిన నిఫ్టీ 

కొనసాగిన రికార్డుల పర్వం

రాణించిన ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లు

కలిసొచ్చిన అంతర్జాతీయ సంకేతాలు

ముంబై: కార్పొరేట్‌ కంపెనీల మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు రాణించవచ్చనే ఆశలతో స్టాక్‌ మార్కెట్లో బుల్‌ జోష్‌ కొనసాగుతోంది. ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్ల ర్యాలీ అండతో సూచీలు సోమవారం మరోసారి జీవితకాల గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్‌ 487 పాయింట్ల లాభంతో తొలిసారి 49వేల స్థాయిపై 49,269 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 138 పాయింట్లు పెరిగి 14,485 వద్ద ముగిసింది. దేశవ్యాప్తంగా ఈ జనవరి 16వ తేదీ నుంచి కోవిడ్‌–19 టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుండటం, కొత్త అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో అమెరికా నుంచి భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన వెలువడవచ్చనే అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం పుంజుకుంటుందనే సంకేతాలు, దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే కొనుగోళ్లు జరగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 521 పాయింట్లు లాభపడి 49,304 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 14,498 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. మరోవైపు లాభాల మార్కెట్లోనూ మెటల్, బ్యాంకింగ్, మీడియా  షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.  

కరోనా కేసుల రికవరీ రేటు పెరగడంతో పాటు కోవిడ్‌ –19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఈ వారాంతంలో మొదలు కానుండటం మార్కెట్‌కు అనుకూలించిందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ విశ్లేషకుడు బినోద్‌ మోదీ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో వేగవంతమైన రికవరీ సంకేతాల నేపథ్యంలో కంపెనీల క్వార్టర్‌ ఫలితాలు మెరుగ్గా ఉండొచ్చని అన్నారు. త్రైమాసిక విడుదల సందర్భంగా కంపెనీలు వృద్ధి సహాయక చర్యల నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందన్నారు. ఈ సానుకూలాంశాలతో సూచీల రికార్డుల ర్యాలీ స్వల్పకాలం పాటు కొనసాగవచ్చని మోదీ వివరించారు.

టీసీఎస్‌ షేరుకు క్యూ3 ఫలితాల జోష్‌...  
ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ షేరు సోమవారం బీఎస్‌ఈలో 2% లాభంతో రూ.3,175 వద్ధ ముగిసింది. క్యూ3లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం ఇందుకు కారణమైంది. ఇంట్రాడేలో షేరు 3.32 శాతం ఎగసి రూ.3,224 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.12.09 లక్షల కోట్లను తాకింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top