20 వేల దిగువకు నిఫ్టీ | Sensex crashes 800 pts, Nifty closes below 20,000 | Sakshi
Sakshi News home page

20 వేల దిగువకు నిఫ్టీ

Published Thu, Sep 21 2023 5:07 AM | Last Updated on Thu, Sep 21 2023 5:07 AM

Sensex crashes 800 pts, Nifty closes below 20,000 - Sakshi

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(4%), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(2%) షేర్ల పతనంతో స్టాక్‌ సూచీలు బుధవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి (బుధవారం రాత్రి)కి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సైతం సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 796 పాయింట్లు క్షీణించి 66,801 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 232 పాయింట్లు పతనమై 20 వేల స్థాయి దిగువన 19,901 వద్ద నిలిచింది. వెరసి గడిచిన రెండు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి.

ట్రేడింగ్‌ ప్రారంభం అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఫైనాన్స్, మెటల్, బ్యాంకింగ్‌ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 868 పాయింట్లు నష్టపోయి 66,728 వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు క్షీణించి 19,879 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,111 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.573 కోట్ల ఈక్విటీలను విక్రయించారు.

సెన్సెక్స్‌ రెండు రోజుల పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2.89 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.320 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం జీవితకాల కనిష్ట స్థాయి (83.32) నుంచి కోలుకుంది. డాలర్‌ మారకంలో 21 పైసలు బలపడి 83.11 స్థాయి వద్ద స్థిరపడింది. యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ పాటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ ద్రవ్య విధాన వైఖరి వెల్లడికి ముందు చోటు చేసుకున్న అప్రమత్తతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బేరిష్‌ ట్రెండ్‌ నెలకొని ఉంది.

మార్కెట్లో మరిన్ని సంగతులు ...
► ఆర్‌ ఆర్‌ కేబుల్‌ షేరు లిస్టింగ్‌ పర్లేదనిపించింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.1,035)తో పోలిస్తే 14% ప్రీమియంతో రూ.1,179 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 17% ఎగసి రూ.1,213 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 16% లాభంతో 1,197 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.13,500 కోట్లుగా నమోదైంది. పబ్లిక్‌ ఇష్యూ ముగిసిన రెండురోజుల్లోనే ఎక్సే్చంజీల్లో లిస్టయ్యి టీ+2 టైంలైన్‌ విధానంలో లిస్టయిన తొలి కంపెనీగా రికార్డుకెక్కింది.
► చివరి రోజు నాటికి యాత్రా ఆన్‌లైన్‌ ఐపీఓకు 1.61 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ 3.09 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయగా 4.98 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం 2.11 రెట్లు సబ్‌్రస్కిప్షన్‌ సాధించింది.
► హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో విలీనం తర్వాత జూలై ఒకటి నుంచి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) పెరిగే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సోమవారం ప్రకటించింది. అలాగే నోమురా బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు రేటింగ్‌ను ‘బై’ నుంచి ‘న్యూట్రల్‌’కి డౌన్‌గ్రేడ్‌ చేసింది. దీంతో ఈ బ్యాంకు షేరు 4% నష్టపోయి రూ.1564 వద్ద స్థిరపడింది. షేరు భారీ పతనంతో ఒక్క రోజులోనే దాదాపు రూ.50 వేల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కోల్పోయింది. సెన్సెక్స్, నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే.  
► ఎంఅండ్‌ఎం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2 లక్షల కోట్లను అధిగమించింది. ఎస్‌యూవీ విభాగం, ట్రాక్టర్లకు బలమైన ఆర్డర్లు లభించడం ఇందుకు తోడ్పడిందని కంపెనీ తెలిపింది. బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.1634 వద్ద ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement