వచ్చే ఐదు నెలల్లో నియామకం
30 శాతానికి మహిళా ఉద్యోగులు
బ్యాంక్ డిప్యూటీ ఎండీ కిశోర్
న్యూఢిల్లీ: దేశంలోనే దిగ్గజ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ తన కార్యకలాపాలను బలోపేతం చేయడం, దేశవ్యాప్తంగా మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా వచ్చే ఐదు నెలల కాలంలో కొత్తగా 3,500 మంది అధికారులను నియమించుకోవాలన్న ప్రణాళికతో ఉంది. జూన్‌లో 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను (పీవో) ఎస్‌బీఐ నియమించుకోవడం గమనార్హం. ఇంతే సంఖ్యలో పీవోలను నియమించుకునే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నట్టు ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ (హెచ్‌ఆర్), చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కిశోర్ కుమార్ పోలదాసు తెలిపారు.
541 మంది పీవోల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని, దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసినట్టు పేర్కొన్నారు. ఐటీ, సైబర్ సెక్యూరిటీ బాధ్యతలు చూసేందుకు ఇప్పటికే 1,300 మంది అధికారులను నియమించుకున్నట్టు చెప్పారు. 3,000 మంది సర్కిల్ ఆధారిత అధికారుల భర్తీని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వీరి నియామకం పూర్తి చేస్తామన్నారు. ఎస్‌బీఐ వ్యాప్తంగా 18వేల మందిని నియమించుకోనున్నట్టు సంస్థ చైర్మన్ సీఎస్ శెట్టి లోగడ ప్రకటించడం గమనార్హం.
బ్యాంకు ఉద్యోగుల్లో లింగ వైవిధ్యతను పెంచేందుకు, 2030 నాటికి మహిళా ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి చేర్చేందుకు ఒక వ్యూహాన్ని రూపొందించినట్టు కిశోర్ కుమార్ తెలిపారు. ‘‘కస్టమర్ సేవల విభాగాల్లో మహిళా ఉద్యోగులు ప్రస్తుతం 33 శాతంగా ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో చూస్తే 27 శాతమే. దీన్ని 30 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’అని వివరించారు. అన్ని స్థాయిల్లోనూ మహిళలు రాణించేందుకు వీలుగా అనుకూల వాతావరణం ఏర్పాటుకు ఎస్‌బీఐ కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఎస్‌బీఐలో మొత్తం 2.4 లక్షల మంది ఉద్యోగులు ఉండడం గమనార్హం.


