‘బుల్లెట్ 650’ బండి వచ్చేస్తోంది.. | Royal Enfield Bullet 650 Dispatches Begin | Sakshi
Sakshi News home page

‘బుల్లెట్ 650’ బండి వచ్చేస్తోంది..

May 23 2026 1:00 PM | Updated on May 23 2026 1:16 PM

Royal Enfield Bullet 650 Dispatches Begin

భారతీయ రోడ్లపై దశాబ్దాలుగా రారాజుగా వెలుగొందుతున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్’ ఇప్పుడు మరింత శక్తిమంతమైన అవతారంలో వస్తోంది. దేశీయ మార్కెట్లో ప్రీమియం, హై-కెపాసిటీ బైక్‌లకు ఉన్న భారీ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి కంపెనీ తన సరికొత్త ‘బుల్లెట్ 650’ (Bullet 650) మోడల్‌ను తీసుకువస్తోంది. ఇప్పటికే డీలర్‌షిప్‌లకు బైక్‌ల రవాణా కూడా ప్రారంభమవడంతో, ఈ ఐకానిక్ బైక్ విడుదలపై బైక్ ప్రియుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

మిలన్‌లో జరిగిన అంతర్జాతీయ ఆటో షో (EICMA 2025) తో పాటు, గోవాలో నిర్వహించిన మోటోవర్స్ 2025 వేదికపై ఈ బైక్‌ను కంపెనీ తొలిసారిగా ప్రదర్శించింది. అప్పటినుంచే ఆటోమొబైల్ రంగంలో దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది.

లాంచ్‌ ఎప్పుడు.. ధర ఎంత?

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 మోడల్‌ 2026 జూన్ లేదా జూలై మొదటి వారంలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. దీని సుమారు రూ.3.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా.  బుల్లెట్‌కే విలక్షణమైన సాంప్రదాయక లుక్, గంభీరమైన శబ్దం, నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్‌ను ఇందులోనూ కొనసాగించనున్నారు.

విస్తరిస్తున్న 650 సీసీ పోర్ట్‌ఫోలియో

ఐషర్ మోటార్స్ లిమిటెడ్ FY26 ఆర్థిక ఫలితాల సమావేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవో బి. గోవిందరాజన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. "మా ప్రణాళికల్లో ఉన్న బుల్లెట్ 650 మార్కెట్లోకి రావడానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రక్రియలు ప్రారంభమయ్యాయి" అని ఆయన పేర్కొన్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లో ఇప్పటికే ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జీటీ, సూపర్ మెటియోర్, షాట్‌గన్, బేర్ వంటి పాపులర్ 650 సీసీ బైక్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి అత్యంత పురాతన, నమ్మకమైన బ్రాండ్ అయిన ‘బుల్లెట్’ కూడా చేరబోతుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement