
9 ఏళ్లలో రూ.9 లక్షల కోట్లు
2030 నాటికి రూ.25 లక్షల కోట్లకు
ఐఆర్‌ఏ, బీఐఏ అంచనా
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) సాధనాల్లో పెట్టుబడులకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. వీటి నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో రూ.9 లక్షల కోట్లకు చేరినట్టు ఇండియన్ రీట్స్ అసోసియేషన్ (ఐఆర్‌ఏ), భారత్ ఇన్విట్స్ అసోసియేషన్ (బీఐఏ) ప్రకటించాయి. రీట్‌లు, ఇన్విట్‌ల నిర్వహణలోని ఉమ్మడి ఆస్తుల విలువ 2030 నాటికి రూ.25 లక్షల కోట్లకు చేరుకోవచ్చని ప్రకటించాయి.
ప్రస్తుతం ఐదు రీట్‌లు.. బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్, నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్, నాలెడ్జీ రియల్టీ ట్రస్ట్‌లు స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఇక సెబీ నమోదిత 27 ఇన్విట్‌లు ఉండగా, వీటిల్లో ఐదు స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అయ్యాయి. రీట్‌లు, ఇన్విట్‌లపై మొదటిసారి అవగాహన కార్యక్రమాన్ని ఐఆర్‌ఏ, బీఐఏ ఢిల్లీలో నిర్వహించాయి. ఇన్విట్స్ నిర్వహణలోని ఏయూఎం విలువ రూ.7 లక్షల కోట్లుగా ఉంటే, రీట్‌ల నిర్వహణ ఆస్తుల విలువ రూ.2.25 లక్షల కోట్లుగా ఉన్నట్టు ప్రకటించాయి.
ఇన్వెస్టర్లలో పెరుగుతున్న విశ్వాసం
‘‘నేడు క్యాపిటల్ మార్కెట్స్ పరిధిలో రీట్‌లు ప్రధాన పెట్టుబడి సాధనంగా అవతరించాయి. ఆర్థిక మార్కెట్ల పరిధిలో భౌతిక ఆస్తులను పారదర్శకంగా, నియంత్రణల మధ్య అంతర్జాతీయంగా పోటీతత్వంతో నిర్వహిస్తున్నట్టు’’ ఐఆర్‌ఏ చైర్మన్ అలోక్ అగర్వాల్ ప్రకటించారు. ఐదు లిస్టెడ్ రీట్‌ల మార్కెట్ విలువ రూ.1.5 లక్షల కోట్లుగా ఉంటుందని బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ ఎండీ, సీఈవో అయిన అగర్వాల్ తెలిపారు. ఈ సాధనాల పట్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతున్నట్టు చెప్పారు. ఇన్వెస్టర్లకు స్థిరమైన ఆదాయానికి (నగదు ప్రవాహం) వీలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ‘‘ఇన్విట్‌లు పారదర్శకమైన ప్లాట్‌ఫామ్‌లుగా మారాయి.
పెరుగుతున్న భారత మౌలిక రంగ నిధుల అవసరాలకు ఇవి సరిగ్గా సరిపోతాయి’’అని బీఏఐ సీఈవో ఎన్‌ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. మౌలిక రంగంలో పెద్ద ఎత్తున వృద్ధి, పెట్టుబడుల దృష్ట్యా 2030 నాటికి ఇన్విట్‌ల నిర్వహణ ఆస్తుల విలువ రూ.21 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. రీట్‌ల నిర్వహణ ఆస్తుల విలువ 2030 నాటికి రూ.4 లక్షల కోట్లకు చేరుకోవచ్చని ఐఆర్‌ఏ అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1 నాటికి నాలుగు రీట్‌లు మొత్తం మీద రూ.24,300 కోట్లను వాటాదారులకు పంపిణీ చేశాయి. ఇక ఇన్విట్‌లు 2025 మార్చి నాటికి తమ వాటాదారులకు పంపిణీ చేసిన మొత్తం రూ.68,000 కోట్లుగా ఉంది.
స్థిరమైన ఆదాయానికి మార్గం..
రీట్‌లు అన్నవి ఆదాయాన్నిచ్చే వాణిజ్య, రిటైల్ ఆస్తులను నిర్వహిస్తుంటాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాటాదారులు ప్రతీ త్రైమాసికానికి స్థిరమైన ఆదాయాన్ని డివిడెండ్, అసలు, వడ్డీ రూపంలో పంపిణీ చేస్తుంటాయి. నికర మిగులు నుంచి 90 శాతాన్ని వాటాదారులకు పంచాల్సి ఉంటుంది. ఇన్విట్‌లు ఆదాయాన్నిచ్చే మౌలిక రంగ ప్రాజెక్టులను (రహదారులు, విద్యుత్ ప్రసార, పంపిణీ ప్రాజెక్టులు, పైల్‌లైన్లు, గోదాములు తదితర) నిర్వహిస్తుంటాయి.