హైదరాబాద్‌లో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు తగ్గాయా? ఎందుకు?

Real Estate Hyderabad flat registration down details here - Sakshi

జనవరిలో  4,872 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు

నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదిక వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నివాస విభాగం నేల చూపులు మొదలయ్యాయి.  ఈ ఏడాది తొలి నెలలో గ్రేటర్‌లో రూ.2,422 కోట్ల విలువ చేసే 4,872 అపార్ట్‌మెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఇది 34 శాతం తక్కువ. 2021 మొదటి నెలలో రూ.3,269 కోట్లు విలువ చేసే 7,343 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ జరిగాయి. 

గత నెలలో రిజిస్ట్రేషన్‌ జరిగిన వాటిల్లో అత్యధికంగా 54 శాతం గృహాలు రూ.25–50 లక్షలవే. 2021 జనవరిలో ఈ ఇళ్ల వాటా 39 శాతంగా ఉంది. రూ.50 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 25 శాతం నుంచి 28 శాతానికి పెరిగాయి. ఇక రూ.25 లక్షల లోపు ధర ఉన్న అఫర్డబుల్‌ ఇళ్ల వాటా 2021 జనవరిలో 36 శాతం కాగా.. గత నెలలో 18 శాతానికి పడిపోయాయి. 

ఈ జనవరిలో 1,000 నుంచి 2,000 చ.అ. విస్తీర్ణం ఉన్న గృహాలే ఎక్కువగా రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వీటి వాటా 71 శాతం ఉంది. అయితే గతేడాది జనవరిలో వీటి వాటా 72 శాతంగా ఉంది. 2021 జనవరిలో 500–1,000 చ.అ. ఇళ్ల వాటా 15 శాతం ఉండగా.. గత నెలలో 17 శాతానికి పెరిగింది. 2 వేల చ.అ.లకు పైగా విస్తీర్ణం ఉన్న యూ నిట్ల వాటా 9 శాతంగా ఉంది. 

ఎందుకు తగ్గాయంటే.. 
ప్రతి ఏటా మొదటి కొన్ని నెలల పాటు స్థిరాస్తి కార్యకలాపాలు మందగిస్తాయని దీంతో విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై ప్రభావం ఉంటుందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా హైదరాబాద్‌ డైరెక్టర్‌ శామ్సన్‌ ఆర్థూర్‌ తెలిపారు. గృహ కొనుగోలుదారుల కొనుగోలు నిర్ణయంలో ఊహించని మార్పులు, ధరలలో ప్రతికూలతలుంటాయి. వేతన సవరణలు, రాయితీలు, పండుగ సీజన్ల వంటి వాటితో మార్కెట్‌లో సానుకూల ధోరణి కనిపించినప్పుడే కొనుగోళ్లకు మొగ్గుచూపుతారని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆయా ప్రాపర్టీల డెలివరీకి సమయం పడుతుంది దీంతో విక్రయాలు ఎక్కువ జరిగినా.. ఆయా నెలల్లో రిజిస్ట్రేషన్లు తక్కువగా నమోదవుతాయని  వివరించారు.  

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top