
నియమాలను ఉల్లంఘించిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. ఇప్పుడు ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పేకు భారీ జరిమానా విధించింది. 'ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్' (PPIs) కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు ఫోన్‌పే లిమిటెడ్‌కు 21 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
అక్టోబర్ 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను పాటించకపోవడం మాత్రమే కాకుండా.. ఈ విషయంలో సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పాటించలేదని ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ కారణంగానే ఫోన్‌పేకు నోటీస్ జారీ చేయడం జరిగిందని స్పష్టం చేసింది. జరిమానా విధించినప్పటికీ.. ఇది యూజర్లపై ఎటువంటి ప్రభావం చూడదని పేర్కొంది.
ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఫోన్‌పే వంటి అన్ని నాన్ బ్యాంకింగ్స్, ఎస్క్రో బ్యాలెన్స్‌లలో ఏదైనా లోటు ఉంటే వెంటనే రిజర్వ్ బ్యాంక్ పేమెంట్స్ & సెటిల్‌మెంట్ సిస్టమ్స్ విభాగానికి (DPSS) నివేదించాలి. ఎస్క్రో ఖాతా నిల్వలు.. రోజు చివరిలో వ్యాపారులకు చెల్లించాల్సిన బకాయి ఉన్న PPIల విలువ, చెల్లింపుల కంటే తక్కువగా ఉండకూడదని నిబంధనలు పేర్కొంటున్నాయి.
ఇదీ చదవండి: డీజిల్‌లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటన
పీపీఐ మార్గదర్శకాలను పాటించనందుకు.. రిజర్వ్ బ్యాంక్ ఫోన్‌పేకు 2019లో రూ. కోటి, 2020లో నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ. 1.39 కోట్ల జరిమానా విధించింది. ఇప్పుడు మరో సారి రూ. 21 లక్షల జరిమానా విధించింది.