స్పెక్యులేటర్లపై ఆర్‌బీఐ ఉక్కుపాదం | RBI Cracks Down on Offshore Rupee Speculation to Boost Currency Stability | Sakshi
Sakshi News home page

స్పెక్యులేటర్లపై ఆర్‌బీఐ ఉక్కుపాదం

Apr 2 2026 9:10 AM | Updated on Apr 2 2026 3:43 PM

RBI Cracks Down on Offshore Rupee Speculation to Boost Currency Stability

విదేశీ మార్కెట్‌లో రూపాయి పతనాన్ని అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కఠిన చర్యలు తీసుకుంటోంది. కరెన్సీ మార్కెట్లో కృత్రిమంగా ఒత్తిడి పెంచుతున్న స్పెక్యులేటర్ల ఆట కట్టించేలా తాజాగా ఆంక్షలు జారీ చేసింది. ఇది డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో రికవరీకి బాటలు వేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఆఫ్-షోర్ స్పెక్యులేషన్లకు బ్రేక్

తాజా మార్గదర్శకాల ప్రకారం, భారత్‌లో నివసించే వారు లేదా ప్రవాస భారతీయులు ఎవరూ రూపాయికి సంబంధించిన నాన్-డెలివరబుల్ డెరివేటివ్ కాంట్రాక్టులను (ఎన్‌డీఎఫ్‌) ఆఫర్ చేయకుండా అధీకృత డీలర్లపై (బ్యాంకులపై) ఆర్‌బీఐ నిషేధం విధించింది. ముఖ్యంగా ఆన్-షోర్ (భారత మార్కెట్), ఆఫ్-షోర్ (విదేశీ మార్కెట్) ధరల మధ్య ఉన్న తేడాను సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు చేసే ఆర్బిట్రేజ్ ట్రేడ్‌లను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం ఉంది. ఇకపై క్లయింట్లు ఫారెన్‌ ఎక్స్చేంజ్‌ డెరివేటివ్ కాంట్రాక్టులను ఒకసారి రద్దు చేసిన తర్వాత వాటిని తిరిగి బుక్ చేసుకోవడానికి అనుమతించవద్దని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

రూపాయిపై ప్రభావం

సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం వెలువడిన వెంటనే మార్కెట్ వర్గాల్లో సానుకూల స్పందన కనిపిస్తోంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. డాలర్-రూపాయి ఫార్వర్డ్స్ ఈ వారం ఇప్పటివరకు 1.4% పడిపోయాయి. ఇది రూపాయి బలపడుతుందనే అంచనాలకు బలం చేకూరుస్తోంది. గత దశాబ్ద కాలంలో లేనంత సాహసోపేతమైన చర్యగా బ్యాంకుల రోజువారీ ఆన్-షోర్ కరెన్సీ పొజిషన్లను 100 మిలియన్‌ డాలర్లకు ఆర్‌బీఐ పరిమితం చేసింది.

‘రూపాయికి వ్యతిరేకంగా విదేశీ మార్కెట్లలో జరుగుతున్న స్పెక్యులేషన్లను అరికట్టడానికి ఇది అత్యంత కఠినమైన చర్య. గురువారం మార్కెట్లు తెరుచుకోగానే రూపాయి విలువ పెరుగుతుందని ఆశిస్తున్నాం’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కరెన్సీ ఎక్స్‌పర్ట్‌ దిలీప్ పర్మార్ తెలిపారు.

బీఐఎస్ నివేదికల ప్రకారం సింగపూర్, లండన్, హాంకాంగ్ వంటి ప్రాంతాల్లో రూపాయి సగటు రోజువారీ ఆఫ్-షోర్ ట్రేడింగ్ 149 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ భారీ మార్కెట్ భారత దేశీయ మార్కెట్ ధరలను ప్రభావితం చేస్తోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎకనామిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ అభిప్రాయం ప్రకారం ‘మారకపు రేటు నిర్ణయాధికారాన్ని ఆన్-షోర్ మార్కెట్ పరిధిలోకి తీసుకురావాలని ఆర్‌బీఐ గట్టిగా ప్రయత్నిస్తోంది’ అన్నారు.

ఇదీ చదవండి: సెజ్‌ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement