
ఆర్‌బీఐ డేటా విడుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2025–26 ఏప్రిల్–జూన్) కరెంటు ఖాతా లోటు (క్యాడ్)జీడీపీలో 0.2 శాతంగా (2.4 బిలియన్ డాలర్లు) ఉన్నట్టు ఆర్‌బీఐ విడుదల చేసిన డేటా తెలియజేస్తోంది. క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం చివరికి క్యాడ్ జీడీపీలో 0.9 శాతం (8.6 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే చాలా తక్కువకే పరిమితమైంది. సేవల ఎగుమతులు ఇందుకు దోహదం చేసినట్టు డేటా స్పష్టం చేస్తోంది.
ఇక ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో కరెంట్ ఖాతా 13.5 బిలియన్ డాలర్ల మిగులు (జీడీపీలో 1.3 శాతం)తో ఉండడం గమనార్హం. విదేశాలకు చేసే ఎగుమతుల రూపంలో వచ్చే ఆదాయం, దిగుమతులకు చేసే చెల్లింపులు, ఆదాయ స్వీకరణలు ఇవన్నీ కరెంట్ ఖాతా కిందకు వస్తాయి. వస్తు వాణిజ్యానికి సంబంధించి లోటు జూన్ త్రైమాసికంలో 68.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది 63.8 శాతమే. సేవల రూపంలో నికరంగా 47.9 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 39.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వ్యక్తిగత నగదు బదిలీ స్వీకరణలు (విదేశాల్లో స్థిరపడిన వారు మాతృదేశానికి పంపించే) 33.2 బిలియన్ డాలర్లుగా జూన్ త్రైమాసికంలో నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 28.6 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించొచ్చు.
ఇదీ చదవండి: మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే..