పోస్టాఫీసు బ్యాంక్‌లో కొత్త అకౌంట్‌.. జీరో బ్యాలెన్స్‌తో.. | Post Office IPPB SHG savings account launched Zero balance zero charges | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసు బ్యాంక్‌లో కొత్త అకౌంట్‌.. జీరో బ్యాలెన్స్‌తో..

May 2 2026 12:51 PM | Updated on May 2 2026 1:11 PM

Post Office IPPB SHG savings account launched Zero balance zero charges

కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కొత్త అకౌంట్‌ను తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా శక్తికి ఆర్థికంగా మరింత ఊతమిచ్చేందుకు 'స్వయం సహాయక బృందాల (SHG) పొదుపు ఖాతా'ను ప్రత్యేకంగా ప్రారంభించింది. ఎటువంటి ఛార్జీలు లేని ఈ ఖాతా ద్వారా మహిళా సంఘాలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కానున్నాయి.

ఈ ఖాతా ప్రత్యేకతలు ఇవే..
మహిళా సంఘాల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఖాతాలో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.
జీరో బ్యాలెన్స్: ఖాతాలో కనీస నిల్వ (Minimum Balance) ఉంచాల్సిన అవసరం లేదు. దీనిపై ఎలాంటి జరిమానాలు ఉండవు.
పరిమితి: ఈ ఖాతాలో గరిష్టంగా రూ. 2,00,000 వరకు నగదును ఉంచుకోవచ్చు.
ఉచిత సేవలు: నగదు జమ (Deposit), ఉపసంహరణ (Withdrawal)పై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. అలాగే, క్యూఆర్ (QR) కార్డ్ కూడా ఉచితంగానే అందజేస్తారు. ఖాతా మూసివేతకు (Account Closure) కూడా ఎటువంటి ఛార్జీలు లేకపోవడం విశేషం.
స్టేట్‌మెంట్: ప్రతి నెలా ఒక ఫిజికల్ అకౌంట్ స్టేట్‌మెంట్ ఉచితంగా పొందవచ్చు.

వడ్డీ రేట్లు ఇలా..
పొదుపు మొత్తాన్ని బట్టి ఐపీపీబీ ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తోంది. రూ. 1 లక్ష వరకు అయితే ఏడాదికి 2.00% వడ్డీ, రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు ఏడాదికి 2.25%వడ్డీ చెల్లిస్తుంది. ఈ వడ్డీ మొత్తాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసిక ప్రాతిపదికన) జమ చేస్తారు.

ముఖ్యమైన ఛార్జీల వివరాలు
ఖాతా నిర్వహణ దాదాపు ఉచితం అయినప్పటికీ, కొన్ని సేవలపై నామమాత్రపు ఛార్జీలు వర్తిస్తాయి. SMS అలర్ట్స్ కోసం ప్రతి ఎస్ఎంఎస్‌కు రూ. 0.25 + GST, బ్యాలెన్స్ సర్టిఫికెట్ కోసం ఒక్కో దానికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. ఐపీపీబీ కాకుండా ఇతర నెట్‌వర్క్ (AePS) ద్వారా నగదు తీసినా లేదా జమ చేసినా (ఉచిత పరిమితి దాటిన తర్వాత) ప్రతి లావాదేవీకి రూ. 20 ఛార్జీ పడుతుంది. మినీ స్టేట్‌మెంట్‌కు రూ. 5 వసూలు చేస్తారు.

ఖాతా తెరవడం ఎలా?
అర్హత కలిగిన స్వయం సహాయక బృందాలు తమ సమీపంలోని పోస్టాఫీసును లేదా ఐపీపీబీ బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు.  సంఘానికి సంబంధించిన పత్రాలు, సభ్యుల ఆధార్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకెళ్లాలి.డిజిటల్ పద్ధతిలో లేదా ఫిజికల్ ఫారమ్ నింపి సులభంగా ఖాతాను ప్రారంభించవచ్చు. పోస్ట్‌మెన్ లేదా గ్రామీణ డాక్ సేవకుల సహాయంతో మీ ఇంటి వద్దే ఈ సేవలను పొందే వెసులుబాటు కూడా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement