మోదీ పొదుపు మంత్రం.. ఎకానమీకి శుభసూచకం! | PM Narendra Modi saving mantra is a Good news for economy | Sakshi
Sakshi News home page

మోదీ పొదుపు మంత్రం.. ఎకానమీకి శుభసూచకం!

May 12 2026 1:55 AM | Updated on May 12 2026 1:55 AM

PM Narendra Modi saving mantra is a Good news for economy

బంగారం, క్రూడ్‌ భారం తగ్గుతుంది.. దిగుమతుల బిల్లు దిగిరావడం సానుకూలం 

దేశం నుంచి డాలర్ల ప్రవాహానికి చెక్‌.. ఫారెక్స్‌ నిల్వలకు దన్ను... 

రూపాయి పతనానికి అడ్డుకట్ట.. స్వాగతిస్తున్న ఆర్థిక నిపుణులు.. 

దేశీ వినిమయంపై ప్రభావం పడుతుందంటున్న విశ్లేషకులు

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: పశ్చిమాసియా యుద్ధం దెబ్బతో క్రూడ్‌ రేట్లు భగ్గుమనడంతో మన ఆర్థిక వ్యవస్థకు బాగానే సెగ తగులుతోంది. ముడిచమురు ధరలు 100 డాలర్ల పైకి దూసుకెళ్లడంతో దిగుమతుల బిల్లు తడిసిమోపెడవుతోంది. మరోపక్క, బంగారం రేట్లు కూడా దూసుకెళ్లడంతో విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు దిగుజారుతున్నాయి. దీని ప్రభావంతో రూపాయి రోజుకో కొత్త కనిష్టానికి దిగజారి నేల చూపులు చూస్తోంది. తాజాగా 95.28 ఆల్‌ టైమ్‌ కనిష్టానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన సూచన దేశవ్యాప్తంగా అటు పరిశ్రమ వర్గాల్లో ఇటు ప్రజల్లో సంచనలం రేపుతోంది. ఎకానమీకి దన్నుగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసం పొదుపు చర్యలు పాటించాలంటూ మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని.. పెట్రోలు, డీజిల్‌ వాడకాన్ని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని... ఎలక్ట్రిక్‌ వాహనాలు వాడాలన్నారు. అలాగే విదేశీ ప్రయా ణాలను వాయిదా వేసుకోవడం, వంటనూనెలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని కూడా పేర్కొన్నారు. ఈ చర్యలతో ఆర్థిక వ్యవస్థకు లాభంతో పాటు నష్టాలు కూడా ఉంటాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దిగుమతుల భారం తగ్గడంతో కాస్త కరెంట్‌ ఖాతా లోటు దిగొచ్చి.. రూపాయికి దన్నుగా నిలిచినప్పటికీ, దేశీ యంగా వినిమయం తగ్గడంతో ఎకానమీ మందగించే ప్రమాదం కూడా ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు.

బంగారం గుదిబండ...
భారతీయులు సహజంగానే పసిడి ప్రియులు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆభరణాల కొనుగోళ్లకు తోడు ఇటీవల పెరిగిన పుత్తడి రేట్లతో పెట్టుబడులకు కూడా మనోళ్లు సై అంటున్నారు. దీంతో బంగారం దిగుమతులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఏటా దేశంలోకి 700–800 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్నది కేవలం 1–2 టన్ను లు మాత్రమే. 90% పైగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. దేశ దిగుమతుల్లో ఇది దాదాపు 10% మరోపక్క, ఆపదలో ఆదుకునే సాధనంగా పసిడికి ప్రాముఖ్యత పెరగడంతో సెంట్రల్‌ బ్యాంకులు కూడా పొలోమంటూ గోల్డ్‌ నిల్వలు పెంచుకుంటున్నాయి. మన ఆర్‌బీఐ కూడా టన్ను ల కొద్దీ పోగేసుకుంటోంది. ప్రస్తుతం నిల్వలు 880 టన్నులకు చేరాయి. 2005–26లో 72 బిలియన్‌ డాలర్లు విలువైన బంగారం దిగుమతైంది. దీనివల్ల భారీమొత్తంలో ఫారెక్స్‌ నిల్వలు వెచ్చించాల్సి వస్తోంది. అయితే, రేట్లు భారీగా పెరగడంతో ఇటీవల బంగారం దిగుమతులు బాగానే తగ్గుముఖం పట్టాయి. అయితే, రేటు (అంతర్జాతీయంగా ఔన్స్‌ ప్రస్తుతం 4700 డాలర్లు) అధిక స్థాయిలోనే కొనసాగుతుండటంతో భారీగా డాలర్లు వెచ్చించాల్సి వస్తోంది. 

మోదీ చెప్పినట్లుగా బంగారం కొనుగోళ్లు తగ్గించుకుంటే, దిగుమతులు దిగొచ్చి.. ఫారెక్స్‌ నిల్వలకు దన్నుగా నిలుస్తుంది. దీనివల్ల రూపాయి పతనానికి కూడా అడ్డుకట్టపడుతుంది. బంగారం దిగుమతులు 30–40% తగ్గితే 20–25 బిలియన్‌ డాలర్లు ఆదా అవుతాయి. 50% తగ్గితే 36 బిలియన్‌ డాలర్లు సేవ్‌ అవుతాయి. అంటే ప్రజలు బంగారం కొనడం తగ్గిస్తే దేశం నుంచి బయటకు వెళ్లే డాలర్ల ప్రవాహం భారీగా తగ్గుతుంది. అయితే, దేశీయంగా కొనుగోళ్లు మందగించడం వల్ల ఆభరణాల విక్రేతలపై ప్రభావం పడుతుందని పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, ఫిజికల్‌ గోల్డ్‌కు బదులు ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లు, ఈ–గోల్డ్‌ రిసీట్స్‌ వంటి పేపర్‌ గోల్డ్‌ రూపంలో కొనుగోలు చేయడం వల్ల అటు దిగుమతుల భారం తగ్గడంతో పాటు పెట్టుబడులకు కూడా కొలిసొచ్చే అంశమని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇరాన్‌ యుద్ధం మొదలైన తర్వాత ఒక్కసారిగా క్రూడ్‌ ధరలు భగ్గుమనడం తెలిసిందే. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ రేటు 119 డాలర్లకు దూసుకెళ్లింది. రెండు నెలలుగా సగటున 100 డాలర్ల పైనే కదలాడుతోంది. దీంతో క్రూడ్‌ దిగుమతుల భారం భారీగా పెరిగిపోతోంది. భారత్‌ చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం మేర దిగుమతి చేసుకోవాల్సి రావడం.. హార్మూజ్‌ జలసంధిలో అడ్డంకులతో సరఫరా తగ్గడంతో రేట్లు పైపైకి చేరి దిగుమతులు గుదిబండగా మారుతున్నాయి. 2025–26లో మనం 134.7 బిలియన్‌ డాలర్ల విలువైన క్రూడాయిల్‌ దిగుమతి చేసుకోవడం గమానార్హం. మన మొత్తం దిగుమతులు 775 బిలియన్‌ డాలర్లు కాగా, ఇందులో అత్యధిక వాటా క్రూడ్‌దే. అయితే, ప్రభుత్వం మాత్రం పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచకుండా ప్రజలపై భారం పడకుండా చూస్తోంది. మరోపక్క, ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించుకుని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల (ఓఎంసీలు) కు కొంచెం ఊరటనిచ్చింది. దీనివల్ల కేంద్ర ఖాజానాకు నెలకు రూ.14,000 కోట్ల చిల్లు పడుతోంది. 

ఇక రేట్లు పెంచకపోవడం వల్ల ఓఎంసీలు రోజుకు సుమారు రూ.1,700 కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నట్లు అంచనా. అంటే గత పది వారాల్లో వాటిపై ఏకంగా రూ. లక్ష కోట్లకు పైగానే భారం పడినట్లు లెక్క. ఈ నేపథ్యంలోనే మోదీ పెట్రోలు, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించుకోవాలని, కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించాలని, కార్‌ పూలింగ్‌తో పాటు, మెట్రో రైళ్లు ఇతరత్రా ప్రభుత్వ రవాణా సదుపాయాలను వాడాలంటూ సూచించారు. దీనివల్ల అటు క్రూడ్‌ దిగుమతులకు కాస్త అడ్డుకట్టపడి.. ఫారెక్స్‌ నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ పెట్రో పొదుపు మంత్రంతో సోమవారం ఎలక్ట్రిక్‌ వాహన కంపెనీ షేర్లు రివ్వుమనడం విశేషం. కాగా, క్రూడ్‌ ధరలు ఇప్పట్లో శాంతించే అవకాశాలు కనిపించకపోవడం.. మోదీ తాజా సూచనలు చూస్తుంటే, సమీప భవిష్యత్తులో పెట్రో ధరలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదనేది కొంత మంది పరిశీలకుల మాట! 

ట్రావెల్‌ రంగంపై ప్రభావం.. 
విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలంటూ మోదీ సూచించడం కూడా ఫారెక్స్‌ నిల్వలు కరిగిపోకుండా చూసుకోవడం కోసమే.. ఎందుకంటే, విదేశాలకు వెళ్లాలంటే డాలర్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. హోటళ్లను బుక్‌ చేసుకోవాలన్నా డాలర్లు వెచ్చించాల్సిందే. 2025లో 3.27 కోట్ల మంది భారతీయులు విదేశీ ప్రయాణాలకు వెళ్లినట్లు అంచనా. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మనోళ్లు విదేశీ ట్రిప్పుల కోసం వెచ్చించిన మొత్తం 31.7 బిలియన్‌ డాలర్లు. అంటే ఆ మేరకు దేశం నుంచి డాలర్లు బయటికి వెళ్లిపోయాయి. మోదీ సూచన పాటిస్తే, ఈ భారం తగ్గుతుంది. అయితే, విదేశీ ప్రయాణాలు, డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ తగ్గడంతో ట్రావెల్, ఏవియేషన్‌ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. మార్కెట్లో ఇప్పటికే దీని సెగ తగిలింది. యాత్రా, థామస్‌ కుక్‌ వంటి ట్రావెల్‌ సంస్థల షేర్లతో పాటు ఇండిగో షేరు కూడా 5 శాతం పైగా పడిపోయాయి. 

ఫారెక్స్‌ నిల్వలు తగ్గుముఖం... క్యాడ్‌ పైపైకి 
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభానికి ముందు అంటే ఫిబ్రవరి చివరల్లో భారత విదేశీ మారక నిల్వలు 728.5 బిలియన్‌ డాలర్లకు చేరి ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేశాయి. క్రూడ్‌ ధరలు భగ్గమనడం.. దిగుమతుల బిల్లు పెరిగిపోవడంతో ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతూ ప్రస్తుతం సుమారు 690.69 బిలియన్‌ డాలర్లకు చేరాయి. మరోవైపు ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం 2026లో భారత కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌– దేశంలోకి వచ్చి, పోయే విదేశీ మారక ద్రవ్యం (ప్రధానంగా డాలర్లు) మధ్య వ్యత్యాసం) 84.5 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇది మన జీడీపీలో 2 శాతానికి సమానం. అంటే దేశంలోకి వచ్చే డాలర్ల కంటే బయటికి వెళ్లే మొత్తం భారీగా పెరిగిపోతుందన్నమాట! దీనివల్ల రూపాయి మరింత క్షీణించే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement