దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్), అదనపు పన్నుల కారణంగా లీటర్ ఇంధనానికి వివిధ రాష్ట్రాల్లో వినియోగదారులు చెల్లిస్తున్న ధరల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఇంధన ధరలను విశ్లేషించగా.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర అత్యధికంగా ఉండగా గుజరాత్‌లో అత్యల్పంగా నమోదైంది. అంతర్జాతీయంగా ముడిచమురు సంక్షోభాలు వెంటాడుతున్నప్పటికీ, ప్రపంచంలోనే భారత్‌లో ఇంధన ధరల పెంపు తక్కువగా ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.
రూ.115 దాటిన మూడు రాష్ట్రాలు
ఇటీవలి ధరల సవరణ తర్వాత దేశంలోని మూడు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.115 మార్కును దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు ఈ జాబితాలో ముందున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (రూ.117/లీటర్): దేశంలోనే ఇక్కడ ఇంధన ధరలు అత్యధికం. ఏపీ ప్రభుత్వం 31 శాతం వ్యాట్‌తో పాటు లీటరుకు రూ.4 చొప్పున అదనపు పన్ను, రోడ్ డెవలప్‌మెంట్ సెస్ విధిస్తోంది. దీనివల్ల ఇక్కడ ఎఫెక్టివ్ పన్ను రేటు దాదాపు 35 శాతానికి చేరుతోంది.
తెలంగాణ (రూ.116కు చేరువుగా): తెలంగాణలో కూడా భారీగా వ్యాట్ వసూలు చేస్తుండటంతో లీటర్ పెట్రోల్ ధర రూ.116కు చేరువైంది. కేరళలో బేస్ వ్యాట్‌తో పాటు సామాజిక భద్రతా సెస్ (సోషల్ సెక్యూరిటీ సెస్) అదనంగా విధిస్తుండటంతో ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. మరోవైపు గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, గోవా, అస్సాం వంటి ఆరు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.104 లేదా అంతకంటే తక్కువగా ఉంది. ఈ ఆరు రాష్ట్రాలూ బీజేపీ పాలిత ప్రాంతాలు కావడం గమనార్హం.
తాజాగా రేట్లు (ఈరోజు పెరిగిన పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్ రూ.2.71పై కలిపి)
- ఢిల్లీ: పెట్రోల్ రూ.102.11, డీజిల్ రూ.95.12
- ముంబై: పెట్రోల్ రూ.110.88, డీజిల్ రూ.97.48
- హైదరాబాద్: పెట్రోల్ రూ.115.84, డీజిల్ రూ.103.76
- కోల్‌కతా: పెట్రోల్ రూ.112.79, డీజిల్ రూ.99.47
- చెన్నై: పెట్రోల్ రూ.108.14, డీజిల్ రూ.99.84
- బెంగళూరు: పెట్రోల్ రూ.110.30, డీజిల్ రూ.98.44
- పాట్నా: పెట్రోల్ రూ.112.88, డీజిల్ రూ.99.23
- జైపూర్: పెట్రోల్ రూ.112.37, డీజిల్ రూ.97.94
- తిరువనంతపురం: పెట్రోల్ రూ.114.72, డీజిల్ రూ.103.71
- చండీగఢ్: పెట్రోల్ రూ.101.64, డీజిల్ రూ.89.90
- విజయవాడ (ఏపీ): పెట్రోల్ రూ.117.96, డీజిల్ రూ.105.79
- విశాఖపట్నం (ఏపీ): పెట్రోల్ రూ.116.44, డీజిల్ రూ.103.94
- తిరుపతి(ఏపీలో): పెట్రోల్ రూ. 117.08పై, డీజిల్ రూ. 104.75
గమనిక: ధరల్లో ప్రాంతానుసారం స్వల్ప మార్పులు ఉండొచ్చు


