ఈ రోజుల్లో ఉద్యోగాలతో పాటు ఫ్రీలాన్సింగ్, కన్సల్టెన్సీ సేవల ద్వారా ఆర్జించే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే, తాము సంపాదించిన మొత్తంపై భారీగా పన్ను కట్టాలేమోనని చాలామంది ఆందోళన చెందుతుంటారు. ఒకవేళ మీ వార్షిక ఆదాయం రూ. 75 లక్షల లోపు ఉండి, మీరు పన్ను ఆదా చేయాలనుకుంటే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 44ADA మీకు ఒక వరం లాంటిది. ఈ నిబంధన ప్రకారం మీ మొత్తం సంపాదనలో సగానికి సగం పన్ను మినహాయింపు లభిస్తుంది.
అసలు 'సెక్షన్ 44ADA' అంటే ఏమిటి?
సాధారణంగా వ్యాపారాలు చేసే వారికి 'ఊహాత్మక పన్ను విధానం' అందుబాటులో ఉండేది. కానీ, వృత్తినిపుణుల కోసం ప్రభుత్వం 'సెక్షన్ 44ADA' ను ప్రవేశపెట్టింది. ఈ నిబంధన ప్రకారం, అర్హులైన నిపుణుల వార్షిక సంపాదనలో 50 శాతాన్ని ఆఫీసు నిర్వహణ, ప్రయాణాలు, ఇంటర్నెట్, సిబ్బంది జీతాలు వంటి వృత్తిపరమైన ఖర్చుల కింద ప్రభుత్వం గుర్తిస్తుంది. మిగిలిన 50 శాతాన్ని మాత్రమే నికర లాభంగా (ఆదాయంగా) పరిగణించి, దానిపై మాత్రమే పన్ను లెక్కిస్తుంది.
దీనివల్ల వృత్తి నిపుణులు పెద్ద పెద్ద అకౌంట్ పుస్తకాలను నిర్వహించాల్సిన పని లేదు. ఆడిటింగ్, కాగితపు పనుల తలనొప్పి లేకుండా చాలా సులభంగా ఐటీ రిటర్న్స్ (ITR) దాఖలు చేయవచ్చు.
అయితే..
మొత్తం వార్షిక సంపాదనలో నగదు రూపంలో తీసుకునే పేమెంట్లు 5% కంటే తక్కువ ఉండాలి. అంటే కనీసం 95% సంపాదన డిజిటల్ రూపంలో (బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, UPI, చెక్కులు మొదలైనవి) వచ్చి ఉండాలి. ఒకవేళ క్యాష్ లావాదేవీలు 5% కంటే ఎక్కువగా ఉంటే, ఈ సెక్షన్ కింద గరిష్ట పరిమితి రూ. 50 లక్షలు మాత్రమే అవుతుంది.
ఈ సెక్షన్ (44ADA) ఎంచుకునే వారు తమ పన్ను మొత్తాన్ని (Advance Tax) ప్రతి ఏటా మార్చి 15 లోపు ఒకే విడతలో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ పన్ను విధానం లాగా 4 విడతల్లో కట్టే ఆప్షన్ వీరికి ఉండదు.
ఎవరెవరు అర్హులు?
ఈ ప్రత్యేక పన్ను ప్రయోజనాన్ని వ్యక్తులు, భాగస్వామ్య సంస్థలు మాత్రమే పొందగలవు. కానీ, లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్స్ సంస్థలకు ఈ నిబంధన వర్తించదు. ఈ నిబంధన కింద వైద్యులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, ఇంటీరియర్ డిజైనర్లు, టెక్నికల్ కన్సల్టెంట్లు, సృజనాత్మక రంగాల వారు అంటే సినిమా నటులు, దర్శకులు, గాయకులు, రైటర్లు, కెమెరామెన్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, ఎడిటర్లు, ఫ్రీలాన్సర్లు వంటి ఐటీ రిటర్న్స్ వేయవచ్చు.
ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు?
ఈ నిబంధన వల్ల పన్ను భారం ఎలా తగ్గుతుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. కిరణ్ ఒక సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్. ఆయన ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 60 లక్షలు సంపాదించారు. ఆయనకు ల్యాప్‌టాప్ కొనుగోలు, ఆఫీస్ స్పేస్ అద్దె, ప్రయాణాల కోసం వాస్తవంగా అయిన ఖర్చు రూ. 15 లక్షలు అనుకుందాం.
సాధారణ పన్ను విధానంలో అయితే కిరణ్ మొత్తం ఆదాయం (రూ. 60 లక్షలు) నుండి వాస్తవ ఖర్చులు (రూ. 15 లక్షలు) తీసివేస్తే, మిగిలిన రూ. 45 లక్షలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అదే సెక్షన్ 44ADA ప్రకారం ప్రభుత్వం కిరణ్ ఆదాయంలో నేరుగా 50% (అంటే రూ. 30 లక్షలు) ఖర్చుల కింద మినహాయిస్తుంది. మిగిలిన రూ. 30 లక్షలను మాత్రమే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంగా గుర్తిస్తుంది.
దీనివల్ల కిరణ్‌కు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 45 లక్షల నుండి రూ. 30 లక్షలకు తగ్గి, చట్టబద్ధంగా భారీగా పన్ను ఆదా అవుతుంది.
కనీస పేపర్ వర్క్‌తో, అకౌంటెంట్ల చుట్టూ తిరిగే పని లేకుండా పన్ను ఆదా చేసుకోవడానికి సెక్షన్ 44ADA ఒక అద్భుతమైన మార్గం. మీ వార్షిక ఆదాయం రూ. 75 లక్షల లోపు ఉంటే, ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఈ నిబంధనను పరిశీలించి లబ్ధి పొందవచ్చు.


