
నిర్దిష్ట వయసు దాటిన వాహనాలను ప్రజా రహదారులపై నడపడం నిషిద్ధం. ఇలాంటి వాహనాలను స్క్రాపేజ్ సెంటర్లకు తరలించాలని ప్రభుత్వం పలుమార్లు వెల్లడించింది. దీనికోసం స్క్రాపేజ్ సెంటర్లు కూడా పుట్టాయి. ఈ సెంటర్లలో పాత వాహనాలను తుక్కు చేసి.. రీసైక్లింగ్ చేస్తారు.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశంలో 20 ఏళ్లు పైబడిన లైట్ వెయిట్ మోటర్ వాహనాలు 51 లక్షలు, 15 ఏళ్లు పైబడినవి 34 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) అంచనాల ప్రకారం.. 2025 నాటికి దేశవ్యాప్తంగా 2 కోట్ల పైచిలుకు వాహనాల జీవితకాలం ముగియనుంది. వీటన్నింటిని అలాగే వదిలేస్తే.. అవి మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం మాత్రమే కాకుండా.. గాలి, నీరు, మట్టిని కూడా కాలుష్యం చేస్తాయి. కాబట్టి వీటన్నింటినీ రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు.. 75 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో స్క్రాపింగ్ విధానం సవ్యంగా అమలు కావడానికి.. ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది. దీంతో స్క్రాప్ కొనుగోలు చేసే కంపెనీలు చెల్లించాల్సిన జీఎస్టీ తగ్గింది. ఇది రీప్లేస్‌మెంట్ వ్యయాల భారాన్ని తగ్గించేందుకు, పర్యావరణహితమైన విధానాలను ప్రోత్సహించేందుకు తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: రోజుకు వెయ్యి బుకింగ్స్.. లాంచ్‌కు ముందే ఫుల్ డిమాండ్
భారత్‌లోనే అతి పెద్ద రీసైక్లింగ్ వ్యవస్థ
ఆసియాలోనే అగ్రగామి సర్క్యులర్ ఎకానమీ, సస్టైనబిలిటీ సొల్యూషన్స్ సంస్థ రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ (ఆర్ఈఎస్ఎల్) రీ కర్మ (Re Carma), భారత్‌లోనే అతి పెద్ద ఎండ్-ఆఫ్-లైఫ్ వెహికల్ (ఈఎల్‌వీ) రీసైక్లింగ్ వ్యవస్థగా ఆవిర్భవించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ జాఝర్‌లోని రిలయన్స్ మోడల్ ఎకనమిక్ టౌన్‌షిప్‌లో గల రీ కార్మ ఫ్లాగ్‌షిప్ అధునాతన కేంద్రం ఏడాదికి 30,000 కంటే ఎక్కువ వాహనాలను (ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాలు, ఎర్త్‌మూవింగ్ ఎక్విప్‌మెంట్ మొదలైనవి) తుక్కు చేస్తోంది. ఈ హబ్ కాకుండా, రీ కర్మ దేశవ్యాప్తంగా తమ ఫ్రాంచైజీ, భాగస్వాముల నెట్‌వర్క్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోంది.