రూ. 4,389 కోట్ల దిగుమతి సుంకాల ఎగవేత

Oppo India evaded customs duty worth 4389 crore: DRI - Sakshi

ఒప్పో సంస్థకు డీఆర్‌ఐ షోకాజ్‌ నోటీసులు

న్యూఢిల్లీ: దాదాపు రూ. 4,389 కోట్ల దిగుమతి సుంకాల ఎగవేత ఆరోపణలపై చైనాకు చెందిన హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థ ఒప్పో ఇండియాకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) షోకాజ్‌ నోటీసులు (ఎస్‌సీఎన్‌) జారీ చేసింది. జూలై 8న ఈ నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఒప్పో ఇండియా కార్యాలయాలు, సంస్థలోని కీలక ఉద్యోగుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో.. మొబైల్‌ ఫోన్ల తయారీ కోసం దిగుమతి చేసుకున్న కొన్ని ఉత్పత్తుల వివరాలను తప్పుగా చూపినట్లు కచ్చితమైన ఆధారాలు లభించాయి. దీంతో రూ. 4,389 కోట్ల కస్టమ్స్‌ డ్యూటీ ఎగవేతపై ఒప్పో ఇండియాకు షోకాజ్‌ నోటీ జారీ అయ్యింది’ అని పేర్కొంది.  

ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. ఒప్పో ఇండియా కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో, కంపెనీ కొన్ని దిగుమతుల వివరాలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా చూపించినట్లు, నిబంధనలకు విరుద్ధంగా పలు బహుళ జాతి సంస్థలకు రాయల్టీలు, లైసెన్సు ఫీజుల కింద నిధులు చెల్లించినట్లు పక్కా ఆధారాలు లభించాయి. దిగుమతి సుంకాలపరంగా కంపెనీ సుమారు రూ. 2,981 కోట్ల మేర మినహాయింపు ప్రయోజనాలు పొందింది.

అంతే గాకుండా టెక్నాలజీ, బ్రాండ్, మేథోహక్కుల లైసెన్సులు వినియోగించుకున్నట్లు చూపడం ద్వారా పలు సంస్థలకు రాయల్టీ, లైసెన్సు ఫీజులు చెల్లించినట్లు/చెల్లించాల్సి ఉన్నట్లు ప్రొవిజనింగ్‌ చేసింది. వీటిని దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విలువకు జోడించకపోవడం ద్వారా రూ. 1,408 కోట్ల మేర సుంకాలు ఎగవేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. కా గా, ఎస్‌సీఎన్‌లో పేర్కొన్న ఆరోపణలపై తమ అభి ప్రాయం వేరుగా ఉందని ఒప్పో ఇండియా తెలిపింది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించడంతో పాటు తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top