
మాల్స్, స్టార్ హోటల్స్.. తినడానికో లేదా షాపింగ్ కేంద్రాలుగానే కాదు ఆఫీసు కేంద్రాలుగానూ మారుతున్నాయి. గతంలో ప్రత్యేకంగా ఒక వాణిజ్య భవనంలో కో–వర్కింగ్ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీలు ఇప్పుడు షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లనూ కార్యాలయాలుగా కేటాయిస్తున్నాయి. పనిచేసే చోటే రిటైల్, ఫుడ్ వసతులూ ఉంటేనే కంపెనీలు స్వాగతిస్తుండటంతో కో–వర్కింగ్ సంస్థలు మాల్స్, హోటళ్ల వైపు దృష్టిసారించాయి. – సాక్షి, సిటీబ్యూరో
దశాబ్దం కాలంగా దేశంలోని కార్యాలయాల్లో పని వాతావరణంలో మార్పు వచ్చింది. ఆఫీసు డిజైన్, వసతులు, రంగులు వంటివి ఉద్యోగి నైపుణ్యం, ఉత్పాదకత, పని సంస్కృతి వంటి వాటి మీద ప్రభావం చూపిస్తున్నాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. కార్యాలయాల్లో గ్రీనరీ, సహజసిద్ధమైన గాలి, వెలుతురు, వాసన వంటి వాటితో ఉద్యోగిపై పని ఒత్తిడిని తగ్గిస్తుందని, దీంతో మరింత క్రియేటివిటీ బయటకొస్తుందని పరిశోధనల్లోనూ తేలింది. ఆయా వసతులను అందుబాటు ధరల్లో కో–వర్కింగ్ స్పేస్ భర్తీ చేస్తుండటంతో ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్స్ మాత్రమే కాకుండా బహుళ జాతి సంస్థలూ కో–వర్కింగ్ స్పేస్‌లో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి.
గంట, రోజు, నెల వారీగా చార్జీలు..
ఒకే అంతస్తులో ఒక ఆఫీసు బదులు పలు రకాల చిన్న ఆఫీసులు ఉండటాన్ని కో–వర్కింగ్ స్పేస్ అంటారు. ఇక్కడ వ్యాపారం ఎవరిది వారిదే, ఎవరి ప్రమాణాలు వారివే. ప్రతి ఒక్కరికీ కావాల్సిన ప్రైవేట్ ఆఫీసు, ఫిక్స్‌డ్ డెస్క్‌లు, సమావేశ గది, క్యాబిన్లు వంటి సౌకర్యాలు ఉంటాయి. వీటితో పాటూ ప్రత్యేకంగా బహుళ జాతి కంపెనీలకు ఉండే కొరియర్ సర్వీస్, ఫుడ్, లాంజ్, ఎల్‌సీడీ, పార్కింగ్, ప్రింటర్, ప్రొజెక్టర్, వైఫై వంటి అన్ని రకాల ఆధునిక వసతుంటాయి. కో–వర్కింగ్ కార్యాలయాల అద్దెలు గంట, రోజులు, నెల వారీగా ఉంటాయి. నగరంలో నెలకు రూ.8 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్‌రాంగూడ, బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో కో–వర్కింగ్ ఆఫీసులున్నాయి.
అద్దెలు 25 శాతం వరకు తక్కువ
ఐటీ కారిడార్లు, అభివృద్ధి చెందిన వాణిజ్య ప్రాంతాల్లో స్థలాల ధరలు ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసే బదులు కో–వర్కింగ్లోనే స్పేస్‌ను అద్దె తీసుకోవటం కంపెనీలకు సులువవుతుంది. ఇదే కో–వర్కింగ్ డిమాండ్‌కు ప్రధాన కారణం. గ్రీడ్–ఏ ఆఫీస్ స్పేస్‌తో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌లో అద్దెలు 25 శాతం వరకు తక్కువ ఉంటాయి. సాధారణ ఆఫీసులో సీట్లతో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌లో ఒక్కో సీటుకు 5–15 శాతం స్థలం ఆదా అవుతుంది. పైగా ప్రతి కంపెనీ ప్రత్యేకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునే బదులు అన్ని కంపెనీలకు కలిపి ఒకటే పార్కింగ్, హౌస్ కీపింగ్, క్యాంటీన్, రిసెప్షన్ వంటి ఏర్పాట్లు ఉంటాయి. దీంతో కంపెనీలకు మౌలిక వసతుల వ్యయం కూడా తగ్గుతుంది.