ప్రముఖ బ్యాంకుల క్రెడిట్‌ కార్డులపై ఆఫర్లు | Sakshi
Sakshi News home page

ప్రముఖ బ్యాంకుల క్రెడిట్‌ కార్డులపై ఆఫర్లు

Published Tue, May 21 2024 9:15 AM

Offers and reward points on bank credit cards

భారత్‌లో క్రెడిట్‌ కార్డు యూజర్ల సంఖ్య పెరుగుతోంది. 2023 ఏప్రిల్‌ నాటికి 8.60 కోట్ల క్రెడిట్‌ కార్డులు వాడకంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024 ప్రారంభం నాటికి వీటి సంఖ్య 10 కోట్లకు చేరవచ్చని అంచనా. ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు వీటిని అందిస్తున్నాయి. అయితే కేవలం ఆర్థిక అవసరాలకే ఈ కార్డులను వాడుతుంటారు. బ్యాంకులు ఆయా కార్డులపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌, వోచర్‌లు, సర్‌ఛార్జ్‌ మినహాయింపులు.. వంటి ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తాయి. కానీ వీటికి సంబంధించి చాలామంది వినియోగదారులకు సరైన అవగాహన ఉండదు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కొన్ని బ్యాంకులు అందిస్తున్న క్రెడిట్‌ కార్డులపై ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.

కొటక్‌ ఫార్చ్యూన్‌ గోల్డ్‌ క్రెడిట్‌ కార్డు

ఈ కార్డును బిజినెస్‌ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఇంధనం, టికెట్‌ బుకింగ్‌ మొదలైన వాటిపై ప్రాథమిక క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కార్డుతో ఒక సంవత్సరంలో రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తే, నాలుగు పీవీఆర్‌ టికెట్లు లేదా రూ.750 వరకు క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు. రూ.500-రూ.3,000 ఇంధన లావాదేవీలపై 1% సర్‌ఛార్జ్‌ మినహాయింపును పొందే అవకాశం ఉంది.

అమెజాన్‌ పే-ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు

షాపింగ్‌ అవసరాలకు ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ఎక్కువగా వాడుతుంటారు. రోజువారీ కొనుగోళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రెడిట్‌ కార్డు ఉన్న కస్టమర్లు కలినరీ ట్రీట్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా భారత్‌లోని 2,500 కంటే ఎక్కువ రెస్టారెంట్స్‌లో డైనింగ్‌ బిల్లులపై 15% ఆదా చేసుకోవచ్చు. 1% ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపు పొందే అవకాశముంది. పొందిన రివార్డులపై పరిమితి, గడువు తేదీ లేదు. అమెజాన్‌లో రివార్డు పాయింట్లను రెడీమ్‌ చేసుకోవచ్చు. మీరు అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కలిగి ఉంటే అమెజాన్‌ ఇండియాలో కొనుగోళ్లపై 5% క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు.

ఏయూ ఎల్‌ఐటీ క్రెడిట్‌ కార్డు

ఏయూ స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌ అందిస్తున్న ఈ కార్డు వల్ల దేశీయ, అంతర్జాతీయ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రిటైల్‌ లావాదేవీలపై 5X, 10X రివార్డు పాయింట్లను పొందొచ్చు. 90 రోజుల కాలవ్యవధిలో మూడుసార్లు 2-5% క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. ఖర్చు చేసిన ప్రతి రూ.100కు 1 రివార్డు పాయింట్‌తో పాటు మీ రిటైల్‌ లావాదేవీల కోసం 2-5% క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి అవకాశముంది. రూ.400-రూ.5000 మధ్య ఇంధన లావాదేవీలపై 1% ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపు పొందొచ్చు. ప్రతి 3 నెలలకు నాలుగు సార్లు విమానాశ్రయ లాంజ్‌లకు యాక్సెస్‌ పొందేవీలుంది.

షాపర్స్‌ స్టాప్‌-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు

ఈ కార్డుతో ప్రతి కొనుగోలుపై రివార్డ్స్‌ పొందొచ్చు. కార్డుదారులు షాపర్స్‌ స్టాప్‌ ప్రైవేట్‌ లేబుల్‌ బ్రాండ్‌లపై ఖర్చు చేసే ప్రతి రూ.150 కొనుగోలుపై 6 ఫస్ట్‌ సిటిజన్‌ పాయింట్లు వస్తాయి. రూ.500 విలువైన షాపర్స్‌ స్టాప్‌ వోచర్‌ను పొందొచ్చు. దీంతో షాపర్స్‌ స్టాప్‌ స్టోర్‌లో కనీసం రూ.3000 కొనుగోలు చేసినప్పుడు ఆ వోచర్‌ను రెడీమ్‌ చేసుకోవచ్చు. కార్డుపై ఒక సంవత్సరంలో రూ.2 లక్షలు ఖర్చు చేస్తే, 2000 ఫస్ట్‌ సిటిజన్‌ పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది. రూ.400-5000 మధ్య ఇంధన లావాదేవీలపై 1% ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపు ఉంది.

యాక్సిస్‌ బ్యాంక్‌ నియో క్రెడిట్‌ కార్డు

ఈ కార్డు ద్వారా చేసే అన్ని కొనుగోళ్లపై ఎడ్జ్‌ రివార్డ్‌ పాయింట్లను పొందడంతో పాటు పేటీఎం, మింత్ర, జొమాటో వంటి భాగస్వామ్య బ్రాండ్‌లపై రాయితీలు ఉంటాయి. బుక్‌మైషో ద్వారా సినిమా టిక్కెట్లు కొనుగోలు చేస్తే, 10% డిస్కౌంట్‌ లభిస్తుంది. ప్రతి రూ.200 ఖర్చుపై ఒక రివార్డు పాయింట్‌ పొందవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement