
ఆన్‌షోర్ వ్యాపార కార్యకలాపాలకు విఘాతం
ఒక్క రోజు డెడ్‌లైన్‌తో కంపెనీలు, ప్రొఫెషనల్స్‌కి అనిశ్చితి
హెచ్1బీ వీసా ఫీజుల పెంపుపై నాస్కామ్ ఆందోళన
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసాలకు సంబంధించి అమెరికా అదనంగా 1,00,000 డాలర్ల ఫీజు విధించడంపై దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనితో ఆన్‌షోర్ ప్రాజెక్టులకు సంబంధించి వ్యాపార కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. ఫలితంగా భారతీయ టెక్నాలజీ సర్వీస్ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. అంతే గాకుండా దీని అమలుకు ఒకే ఒక్క రోజు గడువు ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు, ప్రొఫెషనల్స్, విద్యార్థుల విషయంలో అనిశ్చితి తలెత్తే ప్రమాదం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది.
అంతర్జాతీయ, భారతీయ కంపెనీల కోసం హెచ్1బీ వీసాలపై పని చేస్తున్న భారతీయులపైనా అమెరికా నిర్ణయం ప్రభావం పడుతుందని నాస్కామ్ వివరించింది. వీసా ఫీజులపై ఆదేశాలను అధ్యయనం చేస్తున్నామని, ఇలాంటి మార్పుల వల్ల అమెరికా నవకల్పనల వ్యవస్థపై, అలాగే ఉద్యోగాలపై కూడా ప్రభావాలు పడతాయని పేర్కొంది. వీటికి తగ్గట్లుగా సర్దుబాట్లు చేసుకునేందుకు క్లయింట్లతో కలిసి కంపెనీలు పని చేస్తాయని వివరించింది. ఈ స్థాయి మార్పులు చేసేటప్పుడు వ్యాపారవర్గాలు, వ్యక్తులు ప్రణాళిక వేసుకునేందుకు తగినంత సమయం ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.
‘మేము ఎప్పటికప్పుడు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. దీని వల్ల తలెత్తే ప్రభావాల గురించి పరిశ్రమవర్గాలతో సమాలోచనలు జరుపుతున్నాం‘ అని నాస్కామ్ తెలిపింది. మరోవైపు, ప్రస్తుతం హెచ్1బీ వీసాలు కలిగి ఇతర దేశాల్లో ఉన్న ఉద్యోగులను అత్యవసరంగా అమెరికాకు తిప్పి పంపేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని కంపెనీలకు నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ సూచించారు. కృత్రిమ మేథ, ఇతరత్రా టెక్నాలజీలను అభివృద్ధి చేయడం వేగవంతమవుతున్న తరుణంలో ఇలాంటి చర్యల వల్ల వ్యవస్థకు విఘాతం కలుగుతుందని తెలిపారు.
నవకల్పనలకు నిపుణులు కీలకం..
కొత్త ఆవిష్కరణలను కనుగొనేందుకు, అమెరికా దీటుగా పోటీపడేందుకు, ఆ దేశ ఎకానమీ అభివృద్ధి చెందేందుకు ప్రతిభావంతులు అవసరమని నాస్కామ్ తెలిపింది. ఏఐతో పాటు ఇతరత్రా సాంకేతికతల్లో అనేక మార్పులు జరుగుతున్న తరుణంలో వారి సేవలు కీలకంగా మారాయని వివరించింది. ప్రస్తుతం హెచ్1బీ వీసా ఫీజులు కంపెనీ స్థాయిని బట్టి సుమారు 2,000–5,000 డాలర్ల వరకు ఉన్నాయి. కొత్తగా విధించిన 1,00,000 డాలర్లు దీనికి అదనం.
అమెరికన్ల ఉద్యోగాలను కాపాడే పేరుతో తలపెట్టిన చేపట్టిన ఈ చర్య, కీలకమైన ప్రతిభావంతుల లభ్యతను దెబ్బతీస్తుందని కార్పొరేట్ న్యాయవాది సీఆర్ సుకుమార్ వ్యాఖ్యానించారు. అమెరికా నిర్ణయాన్ని వీసా కన్సల్టెంట్, ఐటీ వ్యాపారవేత్త దిలీప్ కుమార్ నూనే ’షాకింగ్’గా అభివర్ణించారు. అమెరికాలో సర్వీసులు అందిస్తున్న చాలా మటుకు ఐటీ కంపెనీలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. దీనితో ప్రతిభావంతులను అమెరికాకు రప్పించడం కష్టతరం అవుతుంది కాబట్టి అమెరికన్ కంపెనీలపైనా ప్రభావం పడుతుందన్నారు.
అమెరికాలో నియామకాలు పెంచుకుంటున్నాం ..
భారత్ కేంద్రంగా పని చేసే కంపెనీలు అమెరికాలో స్థానికుల నియామకాలను పెంచుకోవడం ద్వారా కొన్నాళ్లుగా వీసాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటున్న సంగతిని నాస్కామ్ గుర్తు చేసింది. ఈ కంపెనీలు హెచ్1బీ ప్రాసెస్‌లకు సంబంధించి అన్ని నిబంధనలను పాటిస్తున్నాయని, నిర్దేశిత జీతభత్యాలు చెల్లిస్తున్నాయని, స్థానిక ఎకానమీ వృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని, కొత్త ఆవిష్కరణల కోసం విద్యాసంస్థలు, స్టార్టప్‌లతో కలిసి పని చేస్తున్నాయని పేర్కొంది. ఈ కంపెనీల్లో హెచ్1బీ వీసాలపై పని చేస్తున్న వర్కర్లతో అమెరికా దేశ భద్రతకు ఎలాంటి ముప్పూ ఉండదని స్పష్టం చేసింది.
ఐటీ కంపెనీల వ్యయాలు పెరుగుతాయ్
హెచ్1బీ వీసాల ఫీజు పెంపుతో భారతీయ ఐటీ కంపెనీలకు వ్యయాలపరంగా సవాళ్లు గణనీయంగా పెరుగుతాయి. సమీప భవిష్యత్తులో దీని పరిణామాలు కొంత తీవ్రంగా ఉండొచ్చు. దేశీ ఐటీ కంపెనీలు అమెరికాలో నియామకాలను మరింతగా పెంచుకునేందుకు, గ్లోబల్ డెలివరీ వ్యవస్థను పటి ష్టం చేసుకునేందుకు ఇది దారి తీయొచ్చు. తద్వా రా సవాలును అవకాశంగా మల్చుకోవడానికి ఆస్కారం ఉంది.
– బీవీఆర్ మోహన్ రెడ్డి, సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్
ఆఫ్‌షోరింగ్ వేగవంతం
హెచ్1బీ వీసా ఫీజుల పెంపుతో కొత్త దరఖాస్తులపై ప్రభావం పడుతుంది. దీని ఎఫె క్ట్‌తో ఓవైపు ప్రతిభావంతులు దొరక్క, మరోవైపు వ్యయాలు పెరిగిపోవడం వల్ల రాబోయే రోజుల్లో కార్యకలాపాల ఆఫ్‌షోరింగ్ మరింత వేగవంతం అవుతుంది. హెచ్1బీ వీసాలపై భారత ఐటీ కంపెనీలు ఆధారపడటం కొన్నాళ్లుగా గణనీయంగా తగ్గిపోయింది. డేటా ప్రకారం అమెరికన్ టెక్ దిగ్గజాలే వీటిని ఎక్కువగా తీసుకుంటున్నాయి. కొత్త దరఖాస్తులకు మాత్రమే కొత్త నిబంధన వర్తిస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే దీని ప్రభావం పరిమితమే. అమెరికాలో చౌకగా పని చేసి పెట్టేలా ఉద్యోగులను పంపించేందుకు కంపెనీలు ఈ వీసాలను ఉపయోగించుకుంటున్నాయన్న అభిప్రాయాలన్నీ అపోహలే. హెచ్1బీ వీసాలను వినియోగించుకునే టాప్ 20 కంపెనీలు సగటున 1,00,000 డాలర్ల పైగానే జీతభత్యాలు ఇస్తున్నాయి.
– మోహన్‌దాస్ పాయ్, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో
అమెరికాకు నష్టం, భారత్‌కు లాభం
హెచ్1బీ వీసా ఫీజులను భారీగా పెంచడం వల్ల అమెరికాలో కొత్త ఆవిష్కరణలపై దెబ్బ పడుతుంది. అయితే, దీని వల్ల భారత్‌లో నవకల్పనలకు ఊతం లభిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, పుణె, గుర్గావ్ లాంటి నగరాలకు కొత్త ప్రయోగశాలలు, పేటెంట్లు, అంకురాలు వెల్లువెత్తుతాయి. తద్వారా హెచ్1బీ ఫీజులను పెంచడమనేది అమెరికాకు నష్టదాయకం, భారత్‌కు లాభదాయకంగా మారుతుంది. దీని వల్ల దేశంలోనే అత్యుత్తమ డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు భారతదేశ వృద్ధి గాధలో, వికసిత భారత్ లక్ష్య సాధనలో పాలుపంచుకునే అవకాశం లభించినట్లవుతుంది.
– అమితాబ్ కాంత్ , నీతి ఆయోగ్ మాజీ సీఈవో