ఈఎస్‌సీఐతో నరెడ్కో తెలంగాణ ఒప్పందం | NAREDCO Telangana MoU Engineering Staff College of India ESCI | Sakshi
Sakshi News home page

ఈఎస్‌సీఐతో నరెడ్కో తెలంగాణ ఒప్పందం

May 27 2026 8:51 PM | Updated on May 27 2026 9:02 PM

NAREDCO Telangana MoU Engineering Staff College of India ESCI

హైదరాబాద్: రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు కలిగిన నిపుణులను తయారుచేసేందుకు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తెలంగాణ కీలక అడుగు వేసింది. దేశంలోనే ప్రముఖ శిక్షణ సంస్థ అయిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI)తో నరెడ్కో తెలంగాణ బుధవారం ఒక అవగాహనా ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.

హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి అర్బన్ హబ్‌గా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణ రంగంలో నిపుణులైన శ్రామిక శక్తిని (టాలెంట్ పూల్) అభివృద్ధి చేయడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందంపై నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు కొప్పుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ రాబోయే దశాబ్ద కాలంలో మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో సరికొత్త వృద్ధిని సాధించబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈఎస్‌సీఐ భాగస్వామ్యంతో సాంకేతికంగానే కాకుండా, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు తెలిసిన తరం నిర్మిస్తామన్నారు. ఈ చొరవ నగర నిర్మాణ రంగంలో స్థిరమైన నాణ్యతను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.

సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంలో తమకున్న అనుభవంతో, రియల్ ఎస్టేట్ రంగానికి సరిపోయే ప్రత్యేక కోర్సులను డిజైన్ చేసి అందిస్తామని ఈఎస్‌సీఐ ప్రతినిధి డాక్టర్ జి. రామేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా నిర్మాణ రంగంలోని వివిధ స్థాయిల నిపుణుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, సర్టిఫికేషన్ కోర్సులు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతికతలు, పర్యావరణ అనుకూల పద్ధతులు, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలపై ఈ శిక్షణ కేంద్రీకృతమవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement