
దేశంలో ఫ్లెక్స్ ఆఫీస్ ట్రెండ్ వేగంగా సాగుతోంది. అభివృద్ధి చెందిన నగరాల్లో.. హైబ్రిడ్ వర్క్ మోడల్‌కు ఇదొక ఉత్తమ పరిష్కారం. మైహెచ్‌క్యూ (MyHQ) 'ఫ్లెక్స్ ఆఫీస్ స్టాక్ ఫుట్‌ప్రింట్' పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.
మైహెచ్‌క్యూ డేటా ప్రకారం.. భారతదేశంలోని మొత్తం ఫ్లెక్స్ ఆఫీసులలో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. ఈ నగరం ఫ్లెక్స్ ఆఫీస్ హబ్‌గా మారింది. ఇక్కడ కూడా ప్రధానంగా.. హైటెక్ సిటీలో 23.4 శాతం ఫ్లెక్స్ ఆఫీసుల, మాదాపూర్‌లో 11.2 శాతం ఉన్నట్లు నివేదిక చెబుతోంది. ఆ తరువాత జాబితాలో బంజారా హిల్స్ (9.9%), బేగంపేట (9.9%), కొండాపూర్ (9.5%), ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (5.3%) మొదలైనవి ఉన్నాయి.
మెట్రో సౌకర్యం, రవాణా కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ఫ్లెక్స్ ఆఫీసుల సంఖ్య పెరుగుతోంది. ఈ సంఖ్య గడిచిన మూడేళ్ళలో పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ ట్రెండ్‌సెట్టర్‌గా మారిపోయింది. దీంతో ఫ్లెక్స్ ఆఫీసులకు డిమాండ్ పెరుగుతోంది.
కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ప్రారంభమైంది. అయితే కరోనా దాదాపు కనుమరుగైపోయినప్పటికీ.. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ విధానాలకు అలవాటుపడిపోయారు. దీనిని నివారించడానికి.. సంస్థలు హైబ్రిడ్ వర్క్ కల్చర్ స్టార్ట్ చేశాయి. దీనికోసం ఫ్లెక్స్ ఆఫీసులను ఎంచుకోవడం మొదలైంది. దీంతో ఫ్లెక్సిబుల్ ఆఫీసులు పుట్టుకొచ్చాయి. ఫ్లెక్సిబుల్ సొల్యూషన్స్ ప్రస్తుతం అన్ని కార్యాలయ లావాదేవీలలో 20% వాటా కలిగి ఉన్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ వ్యాప్తి దాదాపు 30%కి చేరుకుంటుందని సమాచారం.
ఫ్లెక్స్ ఆఫీస్ ఉపయోగాలు
ఫ్లెక్స్ ఆఫీస్ (Flexible Office) అనేది.. ఒకవిధమైన ఆఫీస్ వర్క్ స్పేస్. ఇక్కడ ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేసుకోవచ్చు. స్టార్టప్ కంపెనీలు తక్కువ ఖర్చుతో.. కార్యాలయ నిర్వహణ చేసుకోవడానికి ఫ్లెక్స్ ఆఫీస్ ఉపయోగపడుతుంది. ఫ్రీలాన్సర్లు, రిమోట్ వర్కర్లు తమకు అవసరమైన స్థలాన్ని ఎంచుకుని పని చేయవచ్చు. ఉద్యోగ వాతావరణం ఉంటుంది కాబట్టి.. ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది.