Her Payment Digital: నగదు రహిత వ్యవస్థ బాటలో భారత్‌!

Mission Cashless India: RBI launches Har Payment Digital amid Digital Payments Awareness Week 2023 - Sakshi

‘హర్‌ పేమెంట్‌ డిజిటల్‌’ మిషన్‌ను ఆవిష్కరించిన ఆర్‌బీఐ గవర్నర్‌

యూపీఐ ఆధారిత  పేమెంట్‌ వ్యవస్థపై పలు దేశాల ఆసక్తి

ఆయా దేశాల చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లతో యూపీఐ లింక్‌కు ఏర్పాట్లు

ముంబై: నగదు రహిత వ్యవస్థ ఆవిష్కరణ దిశలో భారత్‌ వేగంగా అడుగులు వేస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రధాన కార్యాలయంలో డిజిటల్‌ చెల్లింపుల అవగాహన వారోత్సవాన్ని (డీపీఏడబ్ల్యూ) 2023 గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సోమ వారం ప్రారంభించారు.  ‘హర్‌ పేమెంట్‌ డిజిటల్‌’ (డిజిటల్‌లోనే ప్రతి చెల్లింపు) పేరుతో కీలక చొరవకు శక్తికాంతదాస్‌ శ్రీకారం చుట్టారు.

బ్యాంకులు, సంబంధిత అన్ని వర్గాలూ  ఆన్‌లైన్‌ చెల్లింపులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, వాటి ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని అభ్యర్థించారు. యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌) పేమెంట్‌ వ్యవస్థ పట్ల ప్రస్తుతం జరుగుతున్న జీ20 దేశాల సమావేశాల్లోసహా పలు దేశాలు ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్నాయన్నారు.  ఈ వ్యవస్థతో సహకారానికి ప్రత్యేకించి ఆయా దేశాల చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లతో యూపీఐను అనుసంధానం చేయడానికి ముందడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.   

ప్రస్తుతం ఈ దేశాలతో..: యూపీఐ వ్యవస్థ ప్రస్తుతం సింగపూర్, యూఏఈ, ఒమన్, సౌదీ అరేబియా, మలేషియా, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్‌లలో అందుబాటులో ఉంది. యూపీఐ  స్వీకరించాలనుకునే 13 దేశాలతో భారత్‌ అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయని సమాచారం.  ‘యూపీఐ’ – సింగపూర్‌ భాగస్వామి ‘పేనౌ’ మధ్య లింకేజీలు యాక్టివేట్‌ అయినప్పటి నుండి, చెల్లింపుల విషయంలో చాలా దేశాలు అటువంటి సహకారంలోకి ప్రవేశించడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయని దాస్‌ తెలిపారు.

యూపీఐ విస్తరణ వేగం..
యూపీఐ ద్వారా చెల్లింపులు గత 12 నెలల్లో విపరీతంగా పెరిగాయని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు.  రోజువారీ లావాదేవీలు 36 కోట్లు దాటాయని అన్నారు. ఫిబ్రవరి 2022లో 24 కోట్లతో పోలిస్తే 50 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. విలువ పరంగా చూస్తే, యూపీఐ లావాదేవీల విలువ 2022 ఫిబ్రవరిలో రూ.5.36 లక్షల కోట్లయితే, 2023 ఫిబ్రవరిలో ఈ విలువ రూ. 6.27 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపారు.  ఫిబ్రవరి 2022లో రూ. 5.36 లక్షల కోట్ల నుండి 17 శాతం వృద్ధిని నమోదు చేశాయని చెప్పారు. గత మూడు నెలల్లో మొత్తం నెలవారీ డిజిటల్‌ చెల్లింపు లావాదేవీలు ప్రతి నెలా రూ. 1,000 కోట్ల మార్కును దాటాయని కూడా ఆయన చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top