సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫార్మ్స్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. రాబోయే నెలల్లో సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి దశ మే 20న ప్రారంభం కానుందని, తొలి విడతలోనే దాదాపు 8,000 మంది ఉగ్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఇది మెటా ప్రపంచ శ్రామిక శక్తిలో సుమారు 10 శాతం వంతు కావడం గమనార్హం.
మార్క్ జుకర్‌బర్గ్ నాయకత్వంలోని మెటా, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్తులో కార్యకలాపాలను మరింత ఆటోమేషన్ చేసే దిశగా కంపెనీ తన శ్రామిక శక్తిని పునర్నిర్మిస్తోంది. కేవలం ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసమే ఏడాదికి సుమారు 135 బిలియన్ డాలర్ల భారీ వ్యయాన్ని కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఈ వ్యూహాత్మక మార్పుల వల్లే ప్రస్తుత ఉద్యోగ కోతలు అనివార్యమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 2022, 2023 మధ్య కాలంలో మెటా దాదాపు 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో అధిక విస్తరణ, తదనంతర ఆర్థిక మందగమనం వల్ల ఆ నిర్ణయాలు తీసుకున్నట్లు అప్పట్లో కంపెనీ వెల్లడించింది. తాజాగా ఇప్పుడు ఏఐ పురోగతి, ఉద్యోగుల ఉత్పాదకతను ప్రాతిపదికగా తీసుకుని తుది జాబితాను ఎగ్జిక్యూటివ్‌లు సిద్ధం చేస్తున్నారు.
నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, స్టాక్ మార్కెట్‌లో కంపెనీ పనితీరును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ లేఆఫ్‌లు సాగనున్నాయి. 2026 చివరి నాటికి మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం ఉందని, దీనివల్ల ప్రభావితమయ్యే మొత్తం ఉద్యోగుల సంఖ్య 16,000కు చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామం ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మరోసారి తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.
ఇదీ చదవండి: కాగ్నిజెంట్ సీఈవోకి భారీ వేతనం.. రూ.కోట్లలో హైక్


