
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తాజాగా ‘విక్టోరిస్’ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. తద్వారా మిడ్ సైజ్ ఎస్‌యూవీల (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) విభాగంలో వాహనాల శ్రేణిని మరింతగా విస్తరించింది. అయితే దీని ధర ఎంత అనేది కంపెనీ వెల్లడించలేదు. విక్టోరిస్‌ను అభివృద్ధి చేయడంపై సుమారు రూ.1,240 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఇందులో హైబ్రిడ్, సీఎన్‌జీ వెర్షన్లు కూడా ఉన్నాయి.
కొత్త తరం కస్టమర్లు వస్తున్న నేపథ్యంలో దేశీయంగా ఆటోమొబైల్ పరిశ్రమ రూపురేఖలు మారుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. ఈ నేపథ్యంలో గణనీయంగా పెరుగుతున్న యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని విక్టోరిస్‌ను రూపొందించినట్లు చెప్పారు. దీన్ని 100 పైగా మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. తమ మొత్తం అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 2020–21 ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతంగా ఉండగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 28 శాతానికి ఎగిసిందని తకెయుచి వివరించారు.
మారుతీ సుజుకీ ప్రస్తుతం ఫ్రాంక్స్, బ్రెజా, జిమ్నీ, గ్రాండ్ విటారా లాంటి ఎస్‌యూవీలను విక్రయిస్తోంది. దేశీయంగా మిడ్–సైజ్ ఎస్‌యూవీల అమ్మకాలు ప్రస్తుతం ఏటా 9.5 లక్షల యూనిట్లుగా ఉండగా, మొత్తం ఎస్‌యూవీల మార్కెట్లో వీటి వాటా 40 శాతంగా ఉంది.
ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగులకు తీపికబురు