
దేశంలోని ప్రముఖ టెక్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగులకు తీపికబురు అందించింది. టెక్నాలజీ రంగం పుంజుకుంటున్న నేపథ్యంలో కంపెనీ తన ఉద్యోగుల్లో ఎక్కువ మందికి 4.5 శాతం నుంచి 7 శాతం వరకు వేతన పెంపును ప్రకటించింది. స్థూల ఆర్థిక అనిశ్చితి కారణంగా వేతన పెంపు విషయంలో గతంలో జాప్యం జరిగినప్పటికీ మధ్య, దిగువ స్థాయి ఉద్యోగుల్లో 80% మందికి ఈ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందని కంపెనీ హామీ ఇచ్చింది.
అస్థిరమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, నిర్వహణ దిద్దుబాట్లను హైలైట్ చేస్తూ టీసీఎస్ ఈ ఏడాది ప్రారంభంలో వార్షిక వేతన పెంపును వాయిదా వేసింది. ఆ సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సతమతమవుతున్న ఐటీ రంగం అంతటా ఆందోళనలు రేకెత్తాయి. కానీ ప్రస్తుతం కంపెనీ పంథా మార్చుకొని పెంపుపై పునరాలోచించినట్లు తెలుస్తుంది. వేతన పెంపు అంశంపై ఓ సీనియర్ ఉద్యోగి మాట్లాడుతూ..‘ఉద్యోగుల ఎదుగుదలకు అనుగుణంగానే ఈ వేతన పెంపు ఉంది. నైపుణ్యం మెరుగుపరుచుకోవడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని నిర్మించడంపై మేము దృష్టి పెట్టాం’ అని చెప్పారు.
ఇదీ చదవండి: జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం పెంపు