అయ్యో మారుతి ! ఆటోమొబైల్‌ సెక్టార్‌పై ‘చిప్‌’ ఎఫెక్ట్‌

Maruti Suzuki Output May Reduce Due To Chipset Scarcity - Sakshi

దేశంలోనే నంబర్‌ వన్‌ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజూకికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కార్ల తయారీలో కీలకమైన సెమికండర్లు (చిప్‌)ల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ సమస్యను అధిగమించేందుకు మారుతి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

చిప్‌సెట్ల ఎఫెక్ట్‌
దసరా, దీపావళి పండుగలకి మన దగ్గర కార్ల అమ్మకాలు జోరుగా సాగుతాయి. మారుతి సైతం ఇదే లక్ష్యంతో భారీగా సేల్స్‌ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన చిప్‌సెట్ల కొరత కారణంగా ఆ అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. మారుతికి చిప్‌సెట్లు తయారు చేసే కంపెనీలు ఇప్పుడప్పుడే డిమాండ్‌కు తగ్గట్టు చిప్‌లు సరఫరా చేయలేమంటూ తేల్చిచెప్పాయి. దీంతో పండగ సీజన్‌ అమ్మకాల మాట అటుంచి చివరకు నెలవారీ తయారీ యూనిట్లలోనూ కోత పెట్టేందుకు మారుతి సిద్ధమైందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

టార్గెట్‌ కుదింపు ?
దసరా, దీపావళీలను లక్ష్యంగా చేసుకుని మారుతి సెప్టెంబరు నెల తయారీ టార్గెట్‌ 60,000 నుంచి 90,000 యూనిట్లుగా ఆగస్టులో నిర్ధేశించుకుంది. అయితే చిప్‌సెట్ల కొరత కారణంగా ఈ టార్గెట్‌ను 50,000 నుంచి 70,000లకు కుదించినట్టు ఎకనామిక్‌ టైమ్స్‌ లో కథనాలు ప్రచురితం అయ్యాయి. సాధారణంగా పండగ సీజన్‌లో లక్షకు పైగా యూనిట్లను మారుతి తయారు చేస్తుంది. కానీ చిప్‌ సెట్ల కొరతతో ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు.

2014 తర్వాత
కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్లు విధించినప్పుడు కూడా మారుతి కార్ల తయారీ ఈ స్థాయిలో దిగువకు చేరుకోలేదు. చివరి సారిగా 2014లో యాభై వేల యూనిట్లు తయారు చేశారు. ఆ తర్వాత ప్రతీ ఏడు 70వేలకు పైగానే కార్లు తయారు అయ్యేవి. చిప్‌సెట్లు, సెమికండక్టర్ల కొరతతో మారుతి ప్రణాళిక అమలు కష్టంగా మారింది. ఓపెన్‌ మార్కెట్‌ నుంచి చిప్‌సెట్లు కొనుగోలు చేసే దిశగా కూడా మారుతి ప్రయత్నాలు చేస్తోంది. 

షేర్‌ ధర తగ్గలేదు
చిప్‌ సెట్ల కొరతతో ఇబ్బందుల్లో మారుతి అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నా ఆ కంపెనీ షేర్‌ వ్యాల్యూ ఏ మాత్రం తగ్గలేదు. సోమవారం రోజు మారుతి షేర్‌  ధర రూ.6605 నుంచి 6,675కి చేరుకోవడం ఈ కంపెనీపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది.  
చదవండి: ఇండియాకి టెస్లా కారు వస్తోందా? జరుగుతున్నదేంటీ?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top