 
													మెటా (Meta) సంస్థ ప్రకటించిన 30 బిలియన్ డాలర్ల రుణ విక్రయం ప్రణాళిక ఇన్వెస్టర్లలో ఆందోళన రేపింది. దీని ఫలితంగా కంపెనీ షేర్లు 11 శాతం వరకు పడిపోయాయి. ఈ పతనం కారణంగా కంపెనీ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత సంపద 235.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఆయన ఐదవ స్థానానికి పడిపోయారు. రెండేళ్లలో ఇదే ఆయనకు కనిష్ఠ స్థానం.
మెటా ఈ నిధులను ప్రధానంగా కృత్రిమ మేధస్సు (AI) పరిశోధన, మౌలిక సదుపాయాలపై వ్యయం చేయడానికి ఉపయోగించనున్నట్లు తెలిపింది. అయితే, పెరుగుతున్న ఏఐ ఖర్చులు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించాయి. కంపెనీ ఈ ఏడాది మూలధన వ్యయాలు 118 బిలియన్ డాలర్ల వరకు పెరగవచ్చని, 2026 నాటికి మరింత ఖర్చు చేయవచ్చని తెలిపిన తరువాత కనీసం ఇద్దరు విశ్లేషకులు మెటా షేర్ల రేటింగ్‌ను తగ్గించారు.
మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సంపదలో జరిగిన 29.2 బిలియన్ డాలర్ల నష్టాన్ని బ్లూమ్‌బర్గ్ ఇప్పటివరకు నమోదైన నాల్గవ అతిపెద్ద ఒక్కరోజు మార్కెట్ ఆధారిత పతనంగా పేర్కొంది.
ఇదే సమయంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆల్ఫాబెట్ సహవ్యవస్థాపకుడు లారీ పేజ్‌లు.. జుకర్‌బర్గ్‌ను సంపద పరంగా అధిగమించారు. ఏఐ, క్లౌడ్ సేవలపై పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఆల్ఫాబెట్ షేర్లు 2.5% పెరిగాయి. విశ్లేషకుల అంచనాలను మించి ఆదాయం నమోదైంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
