LinkedIn Developing AI Coach to Help Job Application - Sakshi
Sakshi News home page

LinkedIn AI coach: మీకు త్వరగా జాబ్‌ వచ్చేలా చేస్తుంది!

Published Fri, Jul 28 2023 8:35 PM

LinkedIn developing AI coach to help job application - Sakshi

ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్ లింక్డ్‌ఇన్.. జాబ్‌ కోసం వెతుకుతున్న యూజర్లకు సహాయం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సాధనంపై పని చేస్తోంది. ‘ఏఐ కోచ్’ పేరుతో పిలుస్తున్న ఈ  కొత్త టూల్‌ ఉద్యోగార్థులకు మరింత సమర్థవంతమైన పద్ధతిలో ఉద్యోగాలను కనుగొని దరఖాస్తు చేసుకోవడానికి సహాయం చేస్తుంది.

ఈ విషయాన్ని లింక్డ్‌ఇన్‌ యాప్ రీసెర్చర్‌ నిమా ఓవ్జీ ట్విటర్‌లో షేర్‌ చేశారు. లింక్డ్‌ఇన్ ఏఐ కోచ్‌పై పని చేస్తోందని, ఇది జాబ్‌లకు దరఖాస్తు చేయండం, నైపుణ్యాన్ని పెంచుకోవడం, వృత్తిపరమైన నెట్‌వర్క్‌ను విస్తరించే మార్గాలను అన్వేషించడంలో ఉద్యోగార్థులకు సహాయపడుతుందని అందులో రాసుకొచ్చారు. 

ఓవ్జీ షేర్ చేసిన లింక్డ్‌ఇన్‌ ఏఐ కోచ్‌ స్క్రీన్‌షాట్‌ను చూస్తే ఇంచుమించు మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్‌బాట్‌ను పోలి ఉంది. ఇందులో ఏఐ కోచ్ ఎలా పని చేస్తుంది.. కంపెనీల వర్క్‌ కల్చర్‌ ఎలా ఉంటుంది.. తదితర వివరాలను మీరు ఏఐ కోచ్‌ నుంచి ఆరా తీయవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని కంపెనీ అయినందున దాని ఏఐ సాంకేతికతతోనే దీన్ని రూపొందించే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి  బ్యాంకు ఉ‍ద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు!

ప్రస్తుతం అన్నింట్లోనూ ఏఐ ఆధారిత సాధనాలు వస్తున్నాయి. వివిధ పనుల కోసం ప్రత్యేకంగా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ అన్వేషణలోనూ ఇవి సహాయం చేయనున్నాయి. ఈ దిశలో ‘ఏఐ కోచ్‌’ ఒక ప్రధాన అడుగు కాబోతోంది. ఇది ఉద్యోగార్థుల సమయం, శ్రమను ఆదా చేస్తుంది. 

మైక్రోసాఫ్ట్ ఇప్పటివరకు తన బింగ్ చాట్‌ను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ యాప్‌లు, ఎడ్, గిట్‌హబ్‌లకు పరిచయం చేసింది. మైక్రోసాఫ్ట్  ముఖ్యమైన ఉత్పత్తులలో లింక్డ్‌ఇన్ కూడా ఒకటి కావడం వల్ల ‘ఏఐ కోచ్’ ద్వారా ఇందులోనూ ఏఐ టెక్నాలజీని పరిచయం చేయబోతోందని చెప్పవచ్చు.

Advertisement
Advertisement