
వారసులు హక్కులే కాదు బాధ్యతలు కూడా స్వీకరించాలి. అలాంటి ఎన్నో బాధ్యతల్లో ఒకానొక బాధ్యత.. చనిపోయిన వారి తరఫున వారి వారసులు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రిటర్నులు దాఖలు చేయాలి. దాఖలు చేయడానికి వారసులకు ధృవీకరణ పత్రం ఉండాలి. దాన్నే వాడుక భాషలో 'లీగల్ హైయిర్ సర్టిఫికెట్' అని అంటారు.
మరణించిన వారి ఆస్తులను పొందడానికి, బ్యాంకు అకౌంటులోని డబ్బులు పొందడానికి ఈ ధృవీకరణ పత్రం ఉండాలి. ఈ పత్రంలో వారసుల పేర్లు ఉంటాయి. వారే, మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆస్తులు, బీమా పాలసీలు, బ్యాంకు అకౌంటులో ఫిక్సిడ్ డిపాజిట్లు మొదలైనవి పొందగలరు. ఇలాంటి ధృవీకరణ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ప్రక్రియ మొదలవుతుంది.
సర్టిఫికెట్ ఎలా వస్తుంది..
మన కాలమ్‌లో ఇది అప్రస్తుతం అయినా, దరఖాస్తు చేసిన తర్వాత మండల/తహసీల్దారు/కోర్టులు రుజువులు అడుగుతాయి. డాక్యుమెంట్లు ఇవ్వాలి. విచారణ ఉంటుంది. ఆ తర్వాత జారీ చేస్తారు. మిగతా అధికార్లు త్వరగా జారీ చేస్తారేమో కానీ కోర్టుకి వెళ్తే చాలాకాలం పడుతుంది.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం..
మరణించిన వ్యక్తికి సంబంధించి తాను జీవించి ఉన్నంత వరకు, తన చేతికి వచ్చిన ఆదాయం మీద పన్ను అధికారికి రిటర్నులు వేయాలి. నిన్ననే ఒక వ్యక్తి పోయారనుకోండి. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఒక రిటర్ను, 2025 ఏప్రిల్ 1 నుంచి 2025 సెప్టెంబర్ 7 వరకు మరొక రిటర్ను.. ఇలా రెండు దాఖలు చేయాలి. గడువు తేదీలోపల చేయాలి.
వారసులేం చేయాలి..
చట్టప్రకారం వారసులు మరణించిన వ్యక్తికి సంబంధించిన రిటర్నులు వేయాలి. ఆదాయం ఎంత, పన్ను భారం ఎంత, టీడీఎస్, టీసీఎస్ మొదలైన విషయాలు అందరికీ మామూలే.
ఏం కాగితాలు /డాక్యుమెంట్లు జతపర్చాలి ..
చనిపోయిన వ్యక్తి పాన్‌కార్డు
చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్
లీగల్ హైయిర్ సర్టిఫికెట్లు
చనిపోయిన వారి విషయంలో పాస్ చేసిన ఆర్డర్లు/నోటీసులు.
పై జాబితాలో (1), (2), అలాగే (4) సులువుగా దొరుకుతాయి. అవన్నీ అప్‌లోడ్ చేయొచ్చు.
లీగల్ హైయిర్ సర్టిఫికెట్ అంటే..
ఈ కింది వాటిని మాత్రమే ఆదాయపు పన్ను వారి పోర్టల్‌లో పొందుపర్చారు
కోర్టు జారీ చేసిన సర్టిఫికెట్
రెవెన్యూ అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్
రెవెన్యూ అధికారులు జారీ చేసిన కుటుంబ సభ్యుల జాబితా సరి్టఫికెట్
రిజిస్టర్ అయిన వీలునామా
స్టేట్ / సెంట్రల్ ప్రభుత్వం జారీ చేసిన పెన్షన్ సర్టిఫికెట్
బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలు జారీ చేసిన సర్టిఫికెట్. అందులో నామినీ పేరుండాలి.
పైన చెప్పిన డాక్యుమెంట్లు, ఇంగ్లీషులో ఉంటే మంచిది. లేకపోతే ప్రాంతీయ భాషల్లో ఉంటే వాటిని ఆంగ్లంలోకి తర్జుమా చేసి అనువాదం ఇవ్వాలి.
అసలు సమస్య ఏమిటంటే..
గడువు తేదీలోపల రిటర్నులు వేయడానికి ప్రధాన ప్రతిబంధకం ఏమిటంటే, పైన చెప్పిన డాక్యుమెంట్లు సకాలంలో జారీ అవ్వకపోవడమే. కోర్టు జారీ చేయడమంటే.. సంవత్సరాలు పట్టేస్తుంది. రెవెన్యూ అధికారులు జారీ చేయడం అంటే నెలలు పడుతుంది. గడువు తేదీలోపల రావడం జరగదు. ఇవి లేకపోతే రిటర్నులు వేయడానికి కుదరడం లేదు. వీలునామా సులువుగా దొరుకుతుంది. వీలునామాలో ఆస్తి పంపకాలే ఉంటాయి కానీ వారసత్వం గురించి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. పెన్షన్ సరి్టఫికెట్‌లో కూడా కేవలం పెన్షన్ ఎవరికి చెందుతుందో వారి పేరే ఉంటుంది. వారసులందరి పేర్లు ఉండకపోవచ్చు. బ్యాంకు వారు జారీ చేసే సరి్టఫికెట్‌లో నామినీ పేరుంటుంది కానీ వారసుల పేర్లు ఉండకపోవచ్చు.
పైన చెప్పిన సమస్యల గురించి డిపార్టుమెంటు వారు ఆలోచించాలి. పరిశీలించాలి. ప్రాక్టికల్‌గా పరిగణనలోకి తీసుకుని కేవలం డెత్ సర్టిఫికెట్‌తో ఫైల్ చేసుకునే వీలు కల్పించాలి. అవసరం అయితే, వారసుల ధృవీకరణ కోసం అసెస్‌మెంట్‌ను పెండింగ్‌లో పెట్టొచ్చు.
ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య