
జాబితాలో అర్బన్ కంపెనీ, బోట్, మౌరి టెక్, జూనిపర్ గ్రీన్, పేస్ డిజిటెక్, ఆల్‌కెమ్ లైఫ్..
రూ.15,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు
ఈ ఏడాది ఇప్పటిదాకా 50 లిస్టింగ్స్
కొద్ది నెలలుగా జోరు చూపుతున్న ప్రైమరీ మార్కెట్లు మరోసారి కళకళలాడనున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా 13 కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం దోహదపడనుంది. ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ మెయిన్ బోర్డులో 50 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. వీటిలో అత్యధికంగా 12 కంపెనీలు గత నెల(ఆగస్ట్)లోనే ఐపీవోలు చేపట్టడం గమనార్హం! వివరాలు చూద్దాం..
ఐపీవో చేపట్టేందుకు సెబీ తాజాగా అనుమతించిన సంస్థల జాబితాలో అర్బన్ కంపెనీ, ఇమేజిన్ మార్కెటింగ్, జూనిపర్ గ్రీన్ ఎనర్జీ, జైన్ రిసోర్స్ రీసైక్లింగ్, మౌరి టెక్, రవి ఇన్‌ఫ్రా బిల్డ్ ప్రాజెక్ట్స్, పేస్ డిజిటెక్, ఓమ్నిటెక్ ఇంజినీరింగ్, కరోనా రెమిడీస్, కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్, ఆల్‌కెమ్ లైఫ్‌సైన్స్, ప్రయారిటీ జ్యువెల్స్, ఓమ్ ఫ్రైట్ ఫార్వార్డర్స్ చేరాయి. ఈ కంపెనీలన్నీ ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్టయ్యే ప్రణాళికల్లో ఉన్నాయి.
గత నెలలోనే..
లిస్టింగ్ బాట పట్టిన కంపెనీలన్నీ ఆగస్ట్ 1–29 మధ్య సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. తద్వారా నిధుల సమీకరణకు తాజాగా అనుమతి పొందాయి. మర్చంట్ వర్గాల అంచనాల ప్రకారం ఈ 13 కంపెనీలు ఉమ్మడిగా రూ. 15,000 కోట్లకుపైగా సమీకరించనున్నాయి. ఇష్యూ నిధులను పలు కంపెనీలు రుణ చెల్లింపులకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నాయి. ఆయా కంపెనీలలోని ప్రస్తుత వాటాదారులు ఐపీవోలో షేర్లను ఆఫర్ చేయడం ద్వారా పెట్టుబడులను విక్రయించనున్నారు.
రూ.1,900 కోట్లపై కన్ను
యాప్ ఆధారంగా బ్యూటీ, హోమ్ సర్వీసులందించే అర్బన్ కంపెనీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 429 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రస్తుత ఇన్వెస్టర్లు మరో రూ. 1,471 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 1,900 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వాటాలు ఆఫర్ చేయనున్న సంస్థలలో యాక్సెల్ ఇండియా, ఎలివేషన్ క్యాపిటల్ తదితరాలున్నాయి.
ఇమేజిన్ మార్కెటింగ్
బోట్ బ్రాండుతో ఆడియో, వేరబుల్ ప్రొడక్టులు రూపొందిస్తున్న ఇమేజిన్ మార్కెటింగ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం తద్వారా రూ. 2,000 కోట్లు సమకూర్చుకునే సన్నాహాల్లో ఉంది. కంపెనీ గోప్యతా మార్గంలో ఐపీవోకు దరఖాస్తు చేసింది.
రెనెవబుల్ ఎనర్జీ
పునరుత్పాదక ఇంధన(రెనెవబుల్ ఎనర్జీ) రంగ కంపెనీ జూనిపర్ గ్రీన్ ఎనర్జీ ఐపీవో ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించడంపై కన్నేసింది. ఇందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది.
మెటల్ గ్రూప్ నుంచి..
జైన్ మెటల్ గ్రూప్ కంపెనీ జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ ఐపీవోకు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 1,500 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. తద్వారా రూ. 2,000 కోట్ల సమీకరణకు తెరతీయనుంది.
రూ. 1,500 కోట్లకు రెడీ
గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ ఐటీ సొల్యూషన్స్ అందించే మౌరి టెక్ లిమిటెడ్ లిస్టింగ్ బాటలో సాగుతోంది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 1,250 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 1,500 కోట్లు అందుకోవాలని చూస్తోంది.
విడిభాగాల కంపెనీ
ప్రెసిషన్ ఇంజినీర్డ్ విడిభాగాలు రూపొందించే ఓమ్నిటెక్ ఇంజినీరింగ్ ఐపీవో ద్వారా రూ. 850 కోట్లు సమీకరించడంపై దృష్టి పెట్టింది. ఇష్యూలో భాగంగా రూ. 520 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో
రూ. 330 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ ఆఫర్ చేయనున్నారు.
ఫార్మా కంపెనీలు
తాజాగా లిస్టింగ్‌కు అనుమతి పొందిన ఫార్మాస్యూటికల్ రంగ కంపెనీల తీరిలా ఉంది. కరోనా రెమిడీస్ ఐపీవో ద్వారా రూ. 800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా ప్రస్తుత వాటాదారులు షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఫార్మా సంబంధ ఏపీఐ, స్పెషాలిటీ కెమికల్స్ తయారు చేసే ఆల్‌కెమ్ లైఫ్‌సైన్స్ ఐపీవోలో భాగంగా రూ. 190 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 71.55 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు.
ఇతర సంస్థల తీరిలా
నిర్మాణ రంగ కంపెనీ రవీ ఇన్‌ఫ్రాబిల్డ్ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. టెలికం ప్యాసివ్ మౌలికసదుపాయాల సంస్థ పేస్ డిజిటెక్ సైతం ఐపీవోలో భాగంగా ఈక్విటీ జారీ(కొత్తగా) ద్వారానే రూ. 900 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికలు వేసింది. ఈ బాటలో వైర్ల తయారీ సంస్థ కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ ఐపీవోలో భాగంగా రూ. 420 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 325 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. తద్వారా రూ. 745 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. బంగారు ఆభరణ తయారీ కంపెనీ ప్రయారిటీ జ్యువెల్స్ ఐపీవో ద్వారా 54 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్ అందించే ఓమ్ ఫ్రైట్ ఫార్వార్డ్స్ ఐపీవోలో భాగంగా రూ. 25 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రమోటర్లు మరో 72.5 లక్షల షేర్లను ఆఫర్ చేయనున్నారు.
ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే..