భారత పౌర విమానయాన చరిత్రలో 2025వ సంవత్సరం ఒక మరుపురాని అధ్యాయంగా మిగిలిపోనుంది. ఈ ఏడాది ఒకవైపు కుంభమేళా వంటి పండుగలతో ఆకాశమంత సంబరాన్ని చూసింది.. మరోవైపు ఘోర విమాన ప్రమాదాలు, సర్వీసుల రద్దుతో పాతాళమంత విషాదాన్ని మిగిల్చింది. అభివృద్ధి బాటలో పయనిస్తున్న దేశీయ ఏవియేషన్ రంగానికి ఈ ఏడాది ఎదురైన సవాళ్లు, భవిష్యత్తు పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.
కుంభమేళా మెరుపులు.. అంతర్జాతీయ గౌరవం
సంవత్సరం ప్రారంభంలో దేశీయ విమానయాన రంగం పరిస్థితి ఎంతో ఆశాజనకంగా ఉంది. జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన కుంభమేళా విమానయాన రంగానికి ఊపునిచ్చింది. 45 రోజుల పాటు సాగిన ఈ వేడుక కోసం విమాన సంస్థలు అదనపు విమానాలను నడిపాయి. దీనివల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో దేశీయ ట్రాఫిక్ 10.35 శాతం వృద్ధి సాధించింది.
మరోవైపు, 42 ఏళ్ల విరామం తర్వాత భారతదేశం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) 81వ వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది.
ఎయిరిండియా విషాదం..
జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 (AI171) ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడటం అత్యంత విషాదకరం.
ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైనదిగా భావించే బోయింగ్ 787 చరిత్రలో ఇది తొలి ప్రమాదం. ఈ ఘటనతో డీజీసీఏ బోయింగ్ 787 విమానాలపై కఠిన తనిఖీలను ఆదేశించింది. ఎయిర్ ఇండియా తన విమానాల భద్రతపై పునసమీక్ష చేపట్టింది.
ఆర్థిక, ఇండిగో సంక్షోభం
విమాన ప్రమాదాలే కాకుండా భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా విమానయాన సంస్థలను దెబ్బతీశాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడంతో ఒక్క ఎయిరియండానే సుమారు రూ.4,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అమెరికా, యూరప్ విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడం వల్ల ఇంధన ఖర్చులు, సిబ్బంది భారం పెరిగిపోయింది.
ఇక దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు ఊహించని విధంగా ఉన్నపలంగా రద్దయ్యాయి. నవంబర్ మాసంలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు నమోదైనప్పటికీ పైలట్ల కొరత కారణంగా వందలాది విమానాలు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ‘ఇండిగో ఏకఛత్రాధిపత్యం అనేది మార్కెట్ వైఫల్యాల వల్ల ఏర్పడిందే తప్ప, ఒక పద్ధతి ప్రకారం జరిగిన అభివృద్ధి కాదు’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భవిష్యత్తుపై ఆశలు
ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ భారత విమానయాన రంగం కోలుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. దేశీయ విమానాల్లో ప్రయాణ డిమాండ్ బలంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విమానయాన కంపెనీలు స్మార్ట్ భాగస్వామ్యాల ద్వారా వృద్ధి సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్‌ఐఏ) వంటి ప్రాజెక్టులు ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో విమానయాన సామర్థ్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు.
2025 సంవత్సరం భారత ఏవియేషన్ రంగానికి ఒక గట్టి హెచ్చరిక. భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం, పైలట్ల నిర్వహణలో వైఫల్యాలు, విదేశీ పరిణామాల ప్రభావం ఈ రంగాన్ని అతలాకుతలం చేశాయి. అయితే, కొత్త విమానాశ్రయాల నిర్మాణం, పెరుగుతున్న ప్రయాణ డిమాండ్ భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి.
ఇదీ చదవండి: కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ


