జీవితానికి బీమా అవసరం.. కానీ

Key Points In Life Insurance Council Survey - Sakshi

91 శాతం మంది అభిప్రాయం ఇదే 

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ వెల్లడి   

ముంబై: దేశంలో మెజారిటీ ప్రజలు జీవిత బీమా అవసరాన్ని గుర్తిస్తున్నారు. జీవిత బీమా పాలసీ కొనుగోలును తప్పనిసరి అవసరంగా 91 శాతం మంది ప్రజలు భావిస్తున్నారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ (ఎల్‌ఐసీ) నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. అయితే ఇప్పటిప్పుడు జీవిత బీమాపై పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నది 70 శాతంగా ఈ సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా 40 పట్టణాల్లో 12,000 మంది ప్రజల అభిప్రాయాల ఆధారంగా సర్వే ఫలితాలను రూపొందించి ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ విడుదల చేసింది. 

‍కరోనా ఎఫెక్ట్‌
జీవిత బీమా రంగంలో భాగస్వాములు అందరి అనుసంధాన వేదికగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ పనిచేస్తుంటుంది. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత జీవిత బీమా పాలసీ తీసుకునే వారు గణనీయంగా పెరిగినట్టు ఈ సర్వే గుర్తించింది. అయితే, జీవిత బీమా పాలసీ కొనుగోలుపై ఇప్పటికీ కొంత మందిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నట్టు పేర్కొంది. 91 శాతం మంది జీవిత బీమా ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నా.. తీసుకునేందుకు 70 శాతమే సుముఖంగా ఉండడాన్ని ప్రస్తావించింది. 

ఆర్థిక రక్షణ కోసం.. 
భవిష్యత్తు ఆర్థిక భద్రత, కుటుంబ ఉమ్మడి ఆర్థిక లక్ష్యాలు, ఊహించనిది జరిగితే రక్షణ అన్నవి.. జీవిత బీమా కొనుగోలుకు ప్రధాన కారణాలుగా ఎక్కువ మంది చెప్పారు. ఇక జీవిత బీమా తీసుకునేందుకు ఉన్న అడ్డంకులను పరిశీలించినట్టయితే.. జీవిత బీమా అన్నది దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉండడంతోపాటు, ఖరీదైనదిగా భావించ డమేనని ఈ సర్వే పేర్కొంది. పశి్చమ భారత్‌లో అహ్మదాబాద్, ముంబై, పుణెలో 92 శాతం మంది జీవిత బీమా తప్పనిసరి అని గుర్తిస్తున్నారు. అన్ని ఆర్థిక సాధనాల్లోనూ జీవిత బీమా గురించి తెలిసిన వారు 96 శాతంగా ఉన్నారు. కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ గురించి తెలిసిన వారు 63 శాతం మంది కాగా, ఈక్విటీ షేర్ల గురించి తెలుసని చెప్పిన వారు 39 శాతంగా ఉన్నారు. యవతతో పోలిస్తే 36 ఏళ్ల వయసుపైన ఎక్కువ మంది జీవిత బీమా కలిగి ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తాము ఏజెంట్‌ ద్వారా పాలసీ తీసుకుంటామని చెప్పగా.. ప్రతి 10 మందిలో ముగ్గురు బ్యాంకుల ద్వారా తీసుకుంటామని తెలిపారు. 

చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. ఏప్రిల్ 1 తర్వాత రూ.1.5 లక్షల రాయితీ రానట్లే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top