త్వరలో ఫలితాలు.. ఐటీ ఉద్యోగుల కష్టాలు తీరినట్టేనా! | Sakshi
Sakshi News home page

త్వరలో ఫలితాలు.. ఐటీ ఉద్యోగుల కష్టాలు తీరినట్టేనా!

Published Mon, Jan 8 2024 8:53 AM

IT Companies Q3 Result Coming Soon - Sakshi

కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇతర సంస్థల పరిస్థితి పక్కన పెడితే ఐటీ కంపెనీల అవస్థలు మాత్రం వర్ణనాతీతం అనే చెప్పాలి. దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. అయితే 2023 ప్రారంభం కంటే చివరి త్రైమాసికం కొంత వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2023లో పరిస్థితులు కొంత సాధారణస్థాయికి వచ్చినప్పటికీ.. చాలా ఐటీ సంస్థలు బడ్జెట్ విషయంలో ఆచి తూచి అడుగులు వేసాయి. ప్రాజెక్టులు ఆలస్యమవ్వడం, రోజురోజుకి తగ్గుతున్న ఆదాయాల వల్ల ఇలా ప్రవర్తించాల్సి వచ్చినట్లు సమాచారం. ఈ ప్రభావం ఉద్యోగుల మీద, వారి జీతాల మీద కూడా పడింది. ఈ కారణంగానే జీతాల పెంపు కూడా కొంత వాయిదా పడింది.

భారతీయ దిగ్గజ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్అండ్ టీ, టెక్ మహీంద్రా మొదలైనవన్నీ ఈ నెలలో తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ ఫలితాలు మునుపటి కంటే కొంత ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు లాభాల్లో రాకపోయినప్పటికీ  వాటి యాజమాన్యాలు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ప్రకటిస్తాయోనని మార్కెట్‌ వర్గాలు వేచిచూస్తున్నాయి. యాజమాన్యాలు ఐటీ రంగానికి సంబంధించి సానుకూలంగా స్పందిస్తే స్టాక్‌ల్లో మంచి ర్యాలీ కనిపించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఫెడ్‌ మీటింగ్‌లో రానున్న రోజుల్లో కీలక వడ్డీరేట్లను పెంచబోమనే సంకేతాలు ఇవ్వడం కూడా మార్కెట్లకు పాజిటివ్‌గా ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గత ఏడాది డిసెంబర్ వరకు చాలామంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు, ఈ ఏడాది ఉద్యోగులను తొలగించే పరిస్థితులు కనిపించనప్పటికీ.. కొత్త ఉద్యోగాలు పెరిగే సూచనలు కూడా ఆశాజనంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌, డాటా సైన్స్‌, సైబర్‌సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిసింది.

ఇదీ చదవండి: ఏం ఐడియా.. మనం కూడా ఇలా చేయగలమా!

ఐటీ సంస్థల ఫలితాల విషయానికి వస్తే.. టైర్ 1 కంపెనీల వృద్ధి 2.6 శాతం నుంచి 5 శాతం, టైర్ 2 సంస్థల ఆదాయం 1 నుంచి 3 శాతం పెరగవచ్చని భావిస్తున్నారు. అయితే ఖచ్చితమైన ఫలితాలు ఈ నెల చివరి నాటికి అన్నీ అందుబాటులోకి వస్తాయి. ఆదాయ వివరాలు ఎలా ఉన్నా దీర్ఘకాలంలో మాత్రం ఐటీ కంపెనీ స్టాక్స్‌ల్లో ర్యాలీ ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement