సాఫ్ట్‌వేర్‌ విజయం సాధించాలంటే.. | Infosys Nandan Nilekani AI Revolution Why Coding Automation Wont Kill IT Jobs | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ విజయం సాధించాలంటే..

Jun 2 2026 12:37 PM | Updated on Jun 2 2026 12:41 PM

Infosys Nandan Nilekani AI Revolution Why Coding Automation Wont Kill IT Jobs

సాంకేతిక ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం సాంప్రదాయ ఐటీ రంగ ఉనికినే ప్రశ్నిస్తోందన్న ఆందోళనలపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని కౌంటర్ ఇచ్చారు. ‘కోడింగ్ ఆటోమేటెడ్ అయితే ఇక ఐటీ కంపెనీలు, ఉద్యోగులు ఎందుకు?’ అంటూ మార్కెట్లో వ్యక్తమవుతున్న అస్తిత్వ ప్రశ్నలకు ఆయన వ్యూహాత్మక సమాధానమిచ్చారు. ఏఐ అనేది ఐటీ సేవల ప్రాధాన్యతను తగ్గించబోదని, పైగా నైపుణ్యాల డిమాండ్‌ను మరింత పెంచిందని ఆయన స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్ వార్షిక నివేదిక సమర్పణ సందర్భంగా వాటాదారులు, పెట్టుబడిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ఆందోళనల మధ్యే అద్భుత వృద్ధి

గత ఏడాది కాలంగా ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థలు అధునాతన ఏఐ సాధనాలను మార్కెట్లోకి తీసుకురావడంతో ఐటీ కంపెనీల భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ భయాల కారణంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇన్ఫోసిస్ షేర్లు ఏకంగా 28% పైగా క్షీణించాయి. అయితే, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇన్ఫోసిస్ బలమైన ఆర్థిక ఫలితాలను సాధించినట్లు చెప్పారు.

వార్షిక ఆదాయం: మునుపటి ఏడాదితో పోలిస్తే 4.6% వద్ధితో 20.16 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.65 లక్షల కోట్లు) వార్షిక ఆదాయాన్ని నమోదు చేసింది.

ఉద్యోగుల సంఖ్య: కంపెనీ ఉద్యోగుల సంఖ్య మునుపటి కంటే 5,016 పెరిగి మొత్తం 3,28,594 కు చేరుకుంది.

మునుపటికంటే బలంగా..

‘జనరేటివ్ ఏఐ (GenAI) రంగ ప్రవేశం చేసి మూడేళ్లు పూర్తయింది. ఈ తరుణంలో ఇన్ఫోసిస్ గతంలో కంటే మరింత సందర్భోచితంగా, పటిష్టంగా మారిందని చెప్పగలం. మన ముందు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఏఐ అనేది మునుపెన్నడూ లేనంత పెద్ద సాంకేతికగా కనిపిస్తుంది. కాబట్టి సందేహాలు రావడం సహజం. కోడింగ్ ఆటోమేటిక్ అయితే, ఇక మన అవసరం ఏముంది? అనే ప్రశ్న మా ముందూ నిలిచింది. కానీ, వాస్తవం దానికి భిన్నంగా ఉంది’ అన్నారు.

ఐటీ అంటే అంతకంటే ఎక్కువే!

ఏఐ కేవలం కోడింగ్‌ను ఆటోమేట్ చేయగలదని, అయితే ఒక పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్ విజయం సాధించాలంటే కేవలం కోడింగ్ సరిపోదని నీలేకని స్పష్టం చేశారు. వేగవంతమైన ఏఐ డిమాండ్‌కు అనుగుణంగా ఐటీ రంగంలో కింది అంశాలు అత్యంత కీలకంగా మారాయని చెప్పారు.

1. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ (ఎస్‌డీఎల్‌సీ) పరీక్షలు: క్లిష్టమైన సిస్టమ్స్‌ను నిరంతరం పర్యవేక్షించడం.

2. సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థలు వైఫల్యం చెందకుండా నిరోధించడం.

3. సైబర్ సెక్యూరిటీ: ఏఐ యుగంలో పెరిగిపోతున్న సైబర్ ముప్పుల నుంచి రక్షణ కల్పించడం.

4. ఐటీ ఆధునీకరణ: పాత సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను సరికొత్త సాంకేతికతకు అనుగుణంగా మార్చడం.

కొత్త వ్యాపార నమూనా వైపు అడుగులు

భవిష్యత్తు ఐటీ రంగాన్ని శాసించడానికి పాత పద్ధతులు సరిపోవని, సరికొత్త వ్యాపార నమూనా అవసరమని నీలేకని పిలుపునిచ్చారు. ‘మేము ఈ సరికొత్త సవాలుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. మా శ్రామిక శక్తిని ఈ కొత్త యుగానికి అనుగుణంగా తీర్చిదిద్దుతా​ం. ఏఐ ఆటోమేషన్, ఉత్పాదకత ద్వారా ఆదా అయ్యే మానవ వనరులను కొత్త యూజర్లను ఆకర్షించడానికి, సరికొత్త సేవలను విస్తరించడానికి తిరిగి వినియోగిస్తాం’ అని నందన్ నీలేకని వాటాదారులకు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: నిన్నటి ధరే నేడు.. ప్రశాంతంగా పసిడి

Advertisement
 
Advertisement
Advertisement