ఉద్యోగులపై నిఘా.. యువతి ఫైర్ (వీడియో) | Indian Woman Rejects WFH Job Over Mandatory Webcam Surveillance Video, Sparks Debate On Strict Monitoring | Sakshi
Sakshi News home page

ఉద్యోగులపై నిఘా.. యువతి ఫైర్ (వీడియో)

May 12 2026 3:22 PM | Updated on May 12 2026 4:27 PM

Indian Woman Rejects WFH Job Over Mandatory Webcam Surveillance Video

భారతదేశంలో ఉద్యోగ సంస్కృతి మరింత కఠినమైపోతోందని, కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది. ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని కంపెనీలు ఆరోపిస్తుంటే.. సంస్థలు ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడిని తెస్తున్నాయని ఎంప్లాయిస్ చెబుతున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో.. నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

గుర్లీన్ అనే మహిళకు, ఒక సంస్థ వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాన్ని కల్పించినప్పటికీ.. కంపెనీ కఠినమైన పర్యవేక్షణ విధానాల కారణంగా తిరస్కరించింది. ఈ సంఘటన ఆధునిక ఉద్యోగ సంస్కృతి, ఉద్యోగుల గోప్యత, మరియు రిమోట్ వర్క్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

గుర్లీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ కంపెనీ ఉద్యోగులు పని చేస్తున్నంతసేపు కెమెరా (వెబ్‌క్యామ్) ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలని నిబంధన పెట్టింది. అంతేకాకుండా.. ప్రతి 10 నిమిషాలకు ఉద్యోగి కంప్యూటర్ స్క్రీన్‌షాట్ తీసి పనితీరును కూడా సంస్థ పరిశీలిస్తుందని వెల్లడించింది.

ఉద్యోగులపై ఇలాంటి నిరంతర నిఘా చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని, ఒత్తిడి కలిగిస్తున్నదని గుర్లీన్ పేర్కొన్నారు. ఈ విధంగా ఉద్యోగికి శిక్షలాగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

వర్క్-ఫ్రం-హోమ్ విధానం అసలు ఉద్దేశం.. ఉద్యోగులకు సౌకర్యం, స్వేచ్ఛ, సమతుల్య జీవనశైలిని అందించడం. కానీ ఇలాంటి కఠినమైన పర్యవేక్షణ వల్ల ఉద్యోగులు భయంతో పనిచేయాల్సి వస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచి, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉంది. సంస్థలు మనుషులను నియమించుకుంటున్నాయా? లేక రోబోలను నియమించుకుంటున్నాయా? అని ఆమె ప్రశ్నించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఉద్యోగులపై అధిక నిఘా పెట్టడం అనేది నమ్మకంలేని పని సంస్కృతికి సంకేతమని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు.. ఇంటి నుంచే పని చేసే ఉద్యోగాలు కార్యాలయంలో పని చేసే ఉద్యోగాల కంటే ఎక్కువ ఒత్తిడిగా మారుతున్నాయని పేర్కొన్నారు. మరికొందరు కంపెనీల విధానాలను సమర్ధించారు.

ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది!

Advertisement
 
Advertisement
Advertisement