
12 రెట్లు పెరగనున్న ఆదాయం
2047 నాటికి రూ. 13 లక్షల కోట్లకు చేరిక
ఏటీఎంఏ, పీడబ్ల్యూసీ ఇండియా సంయుక్త నివేదిక
న్యూఢిల్లీ: ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్, ఎగుమతులు పెరుగుతుండటం వంటి సానుకూల అంశాల తోడ్పాటుతో దేశీ టైర్ల పరిశ్రమ రాబోయే రోజుల్లో గణనీయంగా వృద్ధి చెందనుంది. 2047 నాటికి పరిశ్రమ ఆదాయం 12 రెట్లు పెరిగి రూ. 13 లక్షల కోట్లకు చేరనుంది. ఆటోమోటివ్ టైర్ల తయారీ సంస్థల సమాఖ్య ఏటీఎంఏ, కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దేశీయంగా వాహనాల తయారీ సంస్థలు (ఓఈఎం), రీప్లేస్‌మెంట్‌కి సంబంధించి టైర్లకు డిమాండ్ నెలకొనడం, వాహన ఎగుమతులు వేగవంతం కావడంలాంటి అంశాలు టైర్ల పరిశ్రమ వృద్ధికి దోహదపడతాయని నివేదిక వివరించింది. 2047 నాటికి దేశీయంగా టైర్ల తయారీ పరిశ్రమ ఉత్పత్తి పరిమాణం సుమారు నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వ్యవధిలో ఆదాయం 12 రెట్లు వృద్ధి చెంది రూ. 1,300 కోట్ల మేర పెరగవచ్చని రిపోర్ట్ తెలిపింది.
నివేదిక ప్రకారం ‘వికసిత భారత్ 2047’ లక్ష్యం దిశగా భారత్ ప్రస్థానం సాగిస్తుండటం, టైర్ల పరిశ్రమకు గణనీయంగా అవకాశాలు కల్పిస్తుంది. దేశీ కస్టమర్ల ఆకాంక్షలను నెరవేర్చడమే కాకుండా అమెరికా, యూరోపియన్ యూనియన్‌లాంటి కీలక మార్కెట్లకు వాణిజ్య, ప్యాసింజర్ వాహనాలకు ఉపయోగపడే టైర్లను మరింతగా ఎగుమతి చేసేందుకు కూడా ఇది తోడ్పడుతుందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్ కవన్ ముఖ్తియార్ తెలిపారు.
వినియోగదారులు, మొబిలిటీ ధోరణులు మారుతుండటం, అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు ఎప్పటికప్పుడు కొత్త మార్పులకు లోనవుతుండటం, పర్యావరణహితమైన ఆవిష్కరణలపై ఆసక్తి పెరుగుతుండటమనే విషయాలు, భారతీయ టైర్ల పరిశ్రమ తనను తాను కొత్తగా మల్చుకునేందుకు ఒక చక్కని అవకాశం కల్పిస్తాయని పేర్కొన్నారు. రిపోర్ట్ ప్రకారం మౌలిక సదుపాయాలపై వ్యయాలు, దేశీయంగా వినియోగం పటిష్టంగా ఉండటంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల ఓఈఎం, రీప్లేస్‌మెంట్ టైర్లపరమైన ఆదాయాలు 2047 ఆర్థిక సంవత్సరం నాటికి వార్షికంగా 10 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. ఇక ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నందున భారతీయ టైర్లకు విదేశీ మార్కెట్లలోను అవకాశాలు పెరగనున్నాయి.