
భారత్‌లో తమ ఉత్పత్తులను పరీక్షించడానికి గ్లోబల్ ఆటోమొబైల్ కంపెనీలను స్వాగతిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తద్వారా వారు స్థానికంగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారని తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) నిర్వహించిన 7వ ఆటో కాన్‌క్లేవ్‌లో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారతదేశం పూర్తిగా నిర్మించిన యూనిట్ల (సీబీయూ) దిగుమతిపై కస్టమ్స్ సుంకాలను తగ్గించిందని చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దాంతో అంతర్జాతీయంగా చాలా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.
‘కేంద్రం దేశీయ పరిశ్రమను, తయారీదారులను రక్షించేందుకు చర్యలు చేపడుతోంది. అదే సమయంలో కంపెనీల ఉత్పత్తుల మధ్య సరసమైన పోటీకి కట్టుబడి ఉన్నాం. ఈ పోటీ సామర్థ్యాన్ని పెంచుతోంది. ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుస్తుంది. వ్యాపారాన్ని విస్తరించే లేదా కొత్త మోడళ్లకు అవకాశాలు కల్పించడంలో సమతుల్యత ముఖ్యం. దేశీయ తయారీకి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అయితే పరిశ్రమ వృద్ధి చెందాలంటే మరిన్ని ప్రపంచ కంపెనీలు భారతదేశానికి రావాలి. స్థానికంగా ఉత్పత్తులు తయారు చేసేందుకు లేదా సీబీయూలను పరీక్షించేందుకు ప్రపంచ కంపెనీలు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు.
ఇదిలాఉండగా, జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ‘మేడ్ ఇన్ ఇండియా’ కార్లను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనుకుంటున్నట్లు సూచించిందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ ఛైర్మన్ దేశ ఉత్పత్తి నాణ్యత బలంగా ఉందని తనకు చెప్పినట్లు గడ్కరీ ఇటీవల ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఊబకాయం.. ఆర్థిక భారం!