
ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో నిర్వహించే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 సదస్సులో ప్రధానంగా 6జీ వ్యవస్థను అభివృద్ధి చేయడం, భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. విశ్వసనీయ భాగస్వామిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భారత్, 6జీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించగలదని డిజిటల్ టెక్నాలజీ ప్లాట్‌ఫాం ఐఎంసీ సీఈవో పి. రామకృష్ణ తెలిపారు.
’6జీ వ్యవస్థకు ప్రధానమైన అంశాలను అనుసంధానం చేయగలిగే కీలక ప్లాట్‌ఫాంగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎదుగుతోంది. ఇందులో భారత్‌తో పాటు యూరప్, బ్రిటన్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి పరిశ్రమకు చెందిన సీనియర్ నేతలు, నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. 6జీ సిపోజియంలో టెక్నాలజీ దిగ్గజాలతో పాటు ఐఐటీ, అంతర్జాతీయ యూనివర్సిటీల్లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి విద్యావేత్తలు పాల్గోనున్నారు.
6జీకి సంబంధించిన టెక్నాలజీలు, కృత్రిమ మేథ నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రం క్రమబద్ధీకరణ తదితర అంశాలపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరపనున్నట్లు రామకృష్ణ చెప్పారు. 7,000 మంది పైగా గ్లోబల్ ప్రతినిధులు, 800 మంది వక్తలు, 150 దేశాల నుంచి 400 మంది ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొంటారని అంచనా. 6జీ గ్లోబల్ రేసుకు భారత్ సారథ్యం వహించనుందని సెల్యులార్ ఆపరేటర్స్ సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్‌పీ కొచ్చర్ తెలిపారు.
ఏఐ, జెన్‌ఏఐ టెక్నాలజీల్లో భారతీయ డిజిటల్ ఆవిష్కరణలు, దేశీయంగా టెలికం రంగాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 5జీ విస్తరణ, 6జీ సన్నద్ధతకు 6 గిగాహెట్జ్ బ్యాండ్‌ను సమర్ధవంతంగా కేటాయించడం కీలకంగా ఉంటుందని వివరించారు.