వృద్ధి అంచనా 6.4 శాతానికి కట్‌  | India growth forecast to 6. 4percent as Middle East turmoil clouds | Sakshi
Sakshi News home page

వృద్ధి అంచనా 6.4 శాతానికి కట్‌ 

Jun 10 2026 3:52 AM | Updated on Jun 10 2026 6:27 AM

India growth forecast to 6. 4percent as Middle East turmoil clouds

ఫిచ్‌ రేటింగ్స్‌ ప్రకటన 

గత అంచనా 6.7 శాతం 

వినియోగానికి ధరల మంట

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026–27) భారత్‌ జీడీపీ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ తగ్గించింది. గతంలో 6.7 శాతంగా ప్రకటించిన అంచనాను 6.4 శాతానికి సవరిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా–ఇరాన్‌ యుద్ధంతో సెపె్టంబర్, డిసెంబర్‌ త్రైమాసికాల్లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు నిదానించనున్నట్టు తెలిపింది.

 ప్రజల ఆదాయం, వినియోగ వ్యయాలపై ధరల పెరుగుదల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) జీడీపీ వృద్ధి 7.4 శాతంగా నమోదు కావడం తెలిసిందే. ‘‘జీడీపీ వృద్ధి రేటు 2026–27లో 6.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. మార్చిలో ప్రకటించిన అంచన కంటే 0.3 శాతం తక్కువ. వృద్ధిలో దేశీ డిమాండ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. 

నికర దిగుమతులు తక్కువగా ఉండడం వృద్ధికి అనుకూలించనుంది’’ అని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.6 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చన్నది ఆర్‌బీఐ తాజా అంచనా. ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని జూన్‌ సమీక్ష అనంతరం ప్రకటించడం తెలిసిందే. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలను ఇటీవలి కాలంలో పెంచడాన్ని ఫిచ్‌ తన నివేదికలో ప్రస్తావించింది.  2027–28లో జీడీపీ వృద్ధి 6.7%కి పుంజుకుంటుందని అంచనా వేసింది.  

ధరలు పెరుగుతాయ్‌.. 
భారత్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇంకా చెప్పుకోతగ్గ స్థాయిలో పెరగలేదంటూ, రానున్న నెలల్లో ధరలు క్రమంగా పెరుగుతాయని ఫిచ్‌ తెలిపింది. ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం 8.3%కి పెరగ్గా, రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.5%గా ఉండడాన్ని ప్రస్తావించింది.

అంతర్జాతీయ వృద్ధి 2.4 శాతం 
2026 సంవత్సరానికి అంతర్జాతీయ వృద్ధి రేటు అంచనాలను సైతం 0.2 శాతం తగ్గించి 2.4 శాతంగా ఫిచ్‌ రేటింగ్స్‌ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement