ఎకానమీకి పశ్చిమాసియా సవాళ్లు  | India GDP growth forecast for FY27 is uncertain due to the West Asia conflict | Sakshi
Sakshi News home page

ఎకానమీకి పశ్చిమాసియా సవాళ్లు 

May 1 2026 3:42 AM | Updated on May 1 2026 3:42 AM

 India GDP growth forecast for FY27 is uncertain due to the West Asia conflict

ద్రవ్యోల్బణం పెరిగిపోయే రిస్క్‌ 

ద్రవ్యలోటు, క్యాడ్‌పైనా ప్రభావం 

దేశీ వినియోగం, పెట్టుబడుల అండ 

భారత్‌ ముందు అవకాశాలూ ఉన్నాయ్‌ 

కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. దీనివల్ల వస్తువుల సరఫరాలో ఆటంకాలు ఏర్పడి ధరలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అలాగే, ఎగుమతులు, పెట్టుబడులపైనా ప్రభావం చూపించొచ్చని తెలిపింది. అయితే, బలమైన దేశీ వినియోగం, విధానపరమైన వెసులుబాట్లు, బలమైన ఆర్థిక వ్యవస్థలు, ప్రభుత్వ మూలధన వ్యయాలు ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని తాజా నివేదికలో పేర్కొంది. 

అనిశ్చితులు ఎక్కువ కాలం పాటు కొనసాగితే.. ముఖ్యంగా ఇంధనం, ఎరువుల సరఫరాపై ప్రభావం పడితే అది దేశ స్థూల ఆర్థిక పరిస్థితుల బలాన్ని పరీక్షించొచ్చని తెలిపింది. ఎల్‌ నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతిలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాను ప్రస్తావించింది. ఇది వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపించొచ్చని ఆర్థిక శాఖ నివేదిక అభిప్రాయపడింది. 

చమురు, ఎరువుల సరఫరాలో అనిశ్చితుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని.. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగితే, ముడి సరుకుల కోసం వాటిపై ఆధారపడే ఇతర పరిశ్రమల ఉత్పత్తి వ్యయం పెరిగి సామాన్యులపై భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేసింది. దేశీ ద్రవ్యోల్బణానికి రూపాయి బలహీనత సైతం ఒత్తిళ్లను పెంచుతున్నట్టు తెలిపింది. కనుక ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు పెరిగి, వృద్ధి తగ్గే రిస్క్‌లు ఉన్నాయని వివరించింది. పశ్చిమాసియా సంక్షోభం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసినట్టు వివరించింది. ఆర్థిక వృద్ధిని కొనసాగించేందుకు కృషి చేస్తూనే.. మధ్య కాలానికి ద్రవ్యలోటు, వెలుపలి స్థిరత్వాన్ని (కరెంట్‌ ఖాతా లోటు, బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌ తదితర) కొనసాగించేందుకు విధానపరమైన చర్యలతో భరోసా అవసరమని పేర్కొంది.  

బలమైన వృద్ధి.. 
ప్రస్తుత పరిస్థితుల్లో భారత వృద్ధి రేటు 7 నుండి 7.4 శాతం మధ్య ఉండవచ్చన్న అంచనాలు ఉత్సాహానిస్తున్నట్టు ఆర్థిక శాఖ నివేదిక పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ వృద్ధి రేటుగా నిలుస్తుందని తెలిపింది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల వల్ల రూపాయి విలువ బలహీనపడితే, దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు మరింత పెరగొచ్చని పేర్కొంది. ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న పలు చర్యలను ప్రస్తావించింది. ఎరువుల ఉత్పత్తికి సహజ వాయువు కేటాయింపులను పెంచడంతోపాటు ఖరీఫ్‌ సీజన్‌ కోసం ఎరువులపై ఇచ్చే రాయితీలను 12 శాతం పెంచడం, ఎగుమతులు, దిగుమతుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు పరిపాలనాపరమైన చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేసింది.  

అవకాశాలు.. 
ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభం భారత్‌కు ఒక సవాలు మాత్రమే కాదని.. గొప్ప అవకాశమని ఈ నివేదిక అభిప్రాయపడింది. బలమైన దేశీయ మార్కెట్, స్థిరమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ వల్ల భారత్‌ సురక్షితంగా ఉంటుందని పేర్కొంది. ప్రపంచ దేశాలు తమ సరఫరా వ్యవస్థలను వైవిధ్యం చేసుకోవాలని చూస్తున్న తరుణంలో, భారత్‌ ఒక నమ్మకమైన తయారీ, సేవల కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకోవడం, వ్యూహాత్మక ఇంధన నిల్వలను సిద్ధం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అభిప్రాయపడింది.   

Advertisement
 
Advertisement
Advertisement