
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి టాలెంట్ హబ్ గా ఎదగడానికి భారతదేశానికి సువర్ణ అవకాశం ఉందని గతి (GATI) ఫౌండేషన్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) నివేదిక పేర్కొంది.
ఈ నివేదిక ప్రకారం.. 2047 నాటికి, ప్రపంచ కార్మిక కొరత 200-250 మిలియన్లకు (20 కోట్ల నుంచి 25 కోట్లు) చేరుకుంటుందని అంచనా. అంటే అంత మంది కార్మికుల అవసరం ఏర్పడుతుందని అర్థం. యువ జనాభా, పెరుగుతున్న శ్రామిక శక్తితో భారతదేశం ఈ అంతరాన్ని పూరించడంలో సహాయపడటానికి బలమైన స్థితిలో ఉంది.
5 కోట్ల ఉద్యోగ అవకాశాలు
యూఎస్, యూకే, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు వృద్ధాప్య జనాభా కారణంగా తక్కువ మంది యువ కార్మికులను చూస్తున్నాయి. దీంతో ఇది మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 1 ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టపోతుంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. వాటిలో కనీసం కోటి ఉద్యోగాలను భారత్ భర్తీ చేయగలదు.
భారత్‌కు పెద్ద అనుకూలత
భారతదేశంలో 18-40 సంవత్సరాల వయస్సు గల జనాభా 60 కోట్ల మంది ఉన్నారు. సగటు వయస్సు 30 ఏళ్లలోపు ఉంది. ఇప్పటికే విదేశాలలో ఉన్న భారతీయ కార్మికులు ప్రతి సంవత్సరం 130 బిలియన్ డాలర్లు ఇంటికి పంపుతున్నారు.
మెరుగైన వ్యవస్థలతో ఇది 2030 నాటికి సంవత్సరానికి 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది.
చేయాల్సిందిదే..
ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలంటే కొన్నింటిని మెరుగుపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయేవిధంగా కార్మికుల నైపుణ్యాలు, శిక్షణను మెరుగుపరచడం.
వేగవంతమైన, సురక్షితమైన, మరింత పారదర్శక వలస వ్యవస్థలను నిర్మించడం.
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ, గ్రీన్ ఎనర్జీ, తయారీ వంటి రంగాలపై దృష్టి పెట్టడం.
విదేశాలకు వెళ్లే కార్మికుల కోసం నైతిక, డిజిటల్-ఫస్ట్ ఉద్యోగ మార్గాలను సృష్టించడం.